మాజీ మంత్రి, కాపు బలిజ సంక్షేమసేన అధ్యక్షులు కూటమి ప్రభుత్వానికి హరిరామ జోగయ్య(Harirama Jogaiah) బహిరంగ లేఖ రాశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజవర్గంలో 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలంటూ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ శ్రీనివాస్ వర్మను ఈ లేఖలో కోరారు. అభివృద్ధి అంటే రాజ్య సాధనాలు, పరిపాలన భవనాలు,నివాస భవనాలు, పార్కులు, కళాభవనాలు ,విశ్రాంతిభవనాలు, నిర్మించడానికి ప్రాధాన్యత కాదన్నారు. రోడ్లు నిర్మాణం, సాగునీరు, మురుగు కాలువల నిర్మాణం, స్వచ్ఛమైన తాగునీరు, విద్య, ఆరోగ్య పరిరక్షణతో పాటు వైద్య సౌకర్యం కల్పించడం నిజమైన అభివృద్ధి అని లేఖలో వెల్లడించారు.
నివాస పరిపాలన, రాజ్య భవనాల పేరుతో కోట్ల రూపాయలు వెచ్చించి ఖర్చు చేయడానికి పూనుకోవడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే ప్రాధాన్యతగా కనబడుతుందన్నారు. అభివృద్ధి అంతా కేంద్రీకరిస్తూ ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఇది నిజమైన రాష్ట్ర అభివృద్ధి అనిపించుకోదన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి అదే ప్రభుత్వ లక్ష్యం కావాలి అన్నారు. ఏదైనా చిన్నా పెద్దా వైద్య అవసరం వస్తే అటు హైదరాబాద్.. ఇటు విశాఖపట్నం వెళ్లాల్సిన అవసరం వస్తుందని.. అటువంటి అవస్థల నుండి బయటపడటానికి ప్రతి జిల్లాకి ఆరోగ్యశ్రీ కలిగిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాల్సిన ప్రాధాన్యత ఎంతైనా ఉందని పేర్కొన్నారు.