బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో భాగంగా ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు టెస్టులు ముగియగా..ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. నాలుగో టెస్టు అయిన బాక్సింగ్ డే టెస్టు డిసెంబర్ 26న మెల్‌బోర్న్‌లో జరగనుంది. ఈ సందర్భంగా టీమిండియా సభ్యులు గురువారం గబ్బా నుంచి మెల్‌బోర్న్‌కు చేరుకున్నారు. అయితే స్టార్ ప్లేయర్, కింగ్ విరాట్ కోహ్లీ(Virat Kohli) తన భార్య అనుష్క శర్మతో పాటు కూతురు వామికా, కొడుకు అకాయ్‌లతో కలిసి మెల్‌బోర్న్ విమానాశ్రయంలో కనిపించగానే ఆస్ట్రేలియా జర్నలిస్టులు వీడియోలు తీసేందుకు అత్యుత్సాహం ప్రదర్శించారు.
దీంతో అసహనానికి గురైన పిల్లల ఫొటోలు తీయవద్దని చెప్పినా ఎందుకు తీస్తున్నారంటూ ఓ మహిళా జర్నలిస్టుకు వార్నింగ్ ఇచ్చారు. ఆ వీడియోలను డిలీట్ చేయాలని సూచించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ సిరీస్‌లో కోహ్లీ ఓ సెంచరీ మినహా పెద్దగా పరుగులు చేయలేదు. దీంతో కోహ్లీ ఆటతీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మిగిలిన రెండు టెస్టులోనైనా కోహ్లీ రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.