‘పుష్ఫ2’ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో బాలుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. రెండు వారాలుగా సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యులు ఐసీయూలో వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. తాజాగా బాలుడిని దర్శకుడు సుకుమార్(Sukumar) ఆసుపత్రిలో పరామర్శించారు. బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో శ్రీతేజ్‌కు ఎలాంటి అవసరం వచ్చినా తాను సపోర్ట్‌గా ఉంటానని భరోసా ఇచ్చారు. అలాగే తన తరపున శ్రీతేజ్ కుటుంబానికి రూ. 5 లక్షలు అందించినట్లుగా సమాచారం.
కాగా అంతకుముందు బాలుడిని అల్లు అర్జున్(Allu Arjun) తండ్రి, నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) ఆసుపత్రిలో పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీతేజ్ కోలుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం కూడా శ్రీతేజ్ ఆరోగ్యంపై దృష్టి పెట్టి.. అతడిని మాములు స్థితికి తీసుకురావాలని ఎంతో శ్రమిస్తోందన్నారు. ఇందుకు ప్రభుత్వానికి, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.