తిరుమలలో తెలంగాణ భక్తులపై వివక్ష చూపిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) చేసిన వ్యాఖ్యలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) తీవ్రంగా ఖండించారు. శ్రీనివాస్ గౌడ్‌పై చర్యలకు ఆదేశిస్తున్నామని ఆయన తెలిపారు. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో ఎంతటి వారి విషయంలోనైనా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదన్నారు.
కాగా గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని శ్రీనివాస్ గౌడ్ దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలో తిరుమలలో తెలంగాణ భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారని.. కానీ ఈ మధ్య కాలంలో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.
సాధారణ ప్రజలతో పాటు, రాజకీయ, వ్యాపారవేత్తల విషయంలో వివక్ష కొనసాగుతుందన్నారు. ఇది మంది పద్ధతి కాదని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్లలో ఎక్కువ లబ్ధి పొందింది ఆంధ్ర వాళ్లేనన్నారు. తిరుమలలో తెలంగాణపై వివక్ష చూపితే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఆంధ్ర వాళ్లకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.