రాష్ట్రంలో ‘రైతు భరోసా’(Raithu Bharosa) అమలుపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. అసెంబ్లీలో రైతు భరోసా విధి, విధానాలపై ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో గజ్వేల్ నియోజకవర్గంలో రోడ్డు విస్తరణలో పోయిన భూమికి కూడా రైతుబంధు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయని విమర్శించారు. పోడు భూములకు నకిలీ పట్టాలు సృష్టించి రైతుబంధు పేరుతో బీఆర్ఎస్ నేతలు వేల కోట్ల రూపాయలు లబ్ధి పొందారని ఆరోపించారు. అలాగే ఇప్పుడు కూడా రాళ్లకు, రప్పలకు, గుట్టలకు రైతు భరోసా ఇవ్వాలా..? అని ప్రశ్నించారు. ఒకసారి అధికారం.. మరోసారి డిపాజిట్లు పోయినా వారిలో మర్పు రావడం లేదని చురకలంటించారు.
అబద్దాల సంఘానికి అధ్యక్షుడు కేసీఆర్(KCR) సభకు రాలేదని.. ఉపాధ్యక్షుడు హరీష్ రావు.. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చారని తెలిపారు. గత పదేళ్ల పాలనపై సభలో సమాధానం చెప్పాల్సి వస్తుందేమోనని సభకు రాలేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం సాగులో లేని భూమికి రూ.22 వేల కోట్లకు పైగా రైతుబంధు ఇచ్చారని ఫైర్ అయ్యారు. కొందరు బడాబాబులు, జమీందార్లకు కూడా రైతు భరోసా ఇవ్వాలా అని ప్రశ్నించారు. వ్యవసాయం చేసే రైతులకు పెట్టుబడి సాయం చేసే బాధ్యత తమపై ఉందన్నారు. ఇప్పటికే రైతు భరోసా విధివిధానాలపై మంత్రివర్గ ఉపసంఘం వేశామని, రైతులకు మేలు చేసే సూచనలు విపక్షాలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తామని అన్నారు.