బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అసెంబ్లీలో నిప్పుల చెరిగారు. రుణమాఫీ, రైతు భరోసాపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పాపాల బైరవులు రాష్ట్రాన్ని అమ్మేశారని మండిపడ్డారు. కోకాపేట, ఔటర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ భూములు, హైటెక్ సిటీ ఇలా అన్నీ అమ్మేశారని.. చివరికీ వైన్ షాపులను మిగల్చలేదని ఫైర్ అయ్యారు. వీరు చేసిన అప్పులకు నెలకు రూ.6,500 కోట్ల వడ్డీ కడుతున్నామని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాపాత్ములే వల్లే ఆరు గ్యారంటీలు అమలు చేయలేకపోతున్నామని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు చేసిన ఆర్థిక విధ్వంసానికి ఇతర దేశాల్లో ఉరి తీసేవారని.. దుబాయ్ లాంటి దేశాల్లో అయితే రాళ్ల కొట్టి చంపేవారని వెల్లడించారు.
గత పదేళ్లలో లక్షల కోట్లు పెట్టి ‘కూలేశ్వరం’ (కాళేశ్వరం) ప్రాజెక్ట్ కట్టారంటూ ఎద్దేవా చేశారు. తీరా చూస్తే కొత్తగా కేవలం 50 వేల ఎకరాలకే నీళ్లు ఇచ్చారని ధ్వజమెత్తారు. వాళ్లు చేసిన అప్పుల వల్లే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నామని.. లేదంటే సృష్టించే వాళ్లమని తెలిపారు. కేసీఆర్(KCR) సభకు వస్తే కడిగేద్దామని ఏడాది నుంచి ఎదురు చూస్తున్నా.. కానీ కేసీఆర్ ఏడాది నుంచి సభకు రావడం లేదన్నారు. తాను తండ్రి పేరు చెప్పుకొని ఇక్కడికి రాలేదని కేటీఆర్‌ను(KTR) ఉద్దేశిస్తూ పరోక్ష విమర్శలు చేశారు. జిల్లా స్థాయి నుంచి సీఎం స్థాయికి కష్టపడి ఎదిగానన్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో గందరగోళం నెలకొంది.