సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీలో స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). ప్రీమియర్ షోకి అల్లు అర్జున్(Allu Arjun) రావడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదని.. అయినా బన్నీ వచ్చారని తెలిపారు. మామూలుగా వచ్చి వెళ్తే ఇలా జరిగి ఉండేది కాదని.. కానీ రూఫ్‌టాప్ కారులో అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లారని..దీంతో వేలాది మంది ఉప్పెనలా రావడంతో తొక్కిసలాట జరిగిందన్నారు. ఈ తొక్కిసలాటలో అభం శుభం తెలియని మహిళ మరణించిందని.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.
ఓరోజు జైలుకు వెళ్లిన హీరోను మాత్రం ఇండస్ట్రీ మొత్తం పరామర్శించారని.. అతనికి ఏమైనా కాళ్లు, చేతులు, కిడ్నీలు పోయాయా అని నిలదీశారు. తల్లి చనిపోయి.. 9ఏళ్ల పిల్లవాడు ఆసుపత్రిలో ఉంటే సినీ ప్రముఖులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సినీ ప్రముఖులు ఏం ఆశిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులతో అల్లు అర్జున్ దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే.. ప్రాణం పోయినా అరెస్ట్ చేయవద్దా..? అని ప్రశ్నించారు. అరెస్ట్ చేస్తే తమపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా రేవతి కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.25లక్షలు పరిహారం ప్రకటించారు. ఇకపై టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.