వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు(Ram Gopal Varma) మరో షాక్ తగిలింది. ఇప్పటికే ‘వ్యూహం'(vyuham) సినిమా సమయంలో అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు(Chandrababu), నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌ల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆర్జీవీపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆయన స్టే తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆర్జీవీకి ఏపీ ఫైబర్ నెట్ సంస్థ లీగల్ నోటీసులు జారీ చేసింది.
‘వ్యూహం’ సినిమాకు వ్యూస్ లేకపోయినా ఫైబర్ నెట్ నుంచి రూ.1.15 కోట్లు అనుచిత లబ్ధి పొందారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆర్జీవీతో పాటు అప్పటి ఫైబర్ నెట్ ఎండీ సహా పలువురికి నోటీసులు అందించారు. ఒక వ్యక్తి చూస్తే వంద రూపాయలు మాత్రమే ఇవ్వాలని కానీ రూ.11వేలు చొప్పున ఇవ్వడంపై అభ్యంతరం తెలిపారు. ఫైబర్ నెట్‌లో కేవలం వ్యూహం సినిమాకు కేవలం 1863 వ్యూస్ ఉన్నాయని ఈ లెక్కన ఒక్కో వ్యూస్‌కు రూ.11 వేలు చొప్పున చెల్లించినట్లు అయ్యిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందున 15 రోజుల లోపు వడ్డీతో సహా మొత్తం కట్టాలని ఆదేశించారు.