సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని కిమ్స్ వైద్యులు తెలిపారు. ఈ మేరకు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్(SRI Tej Health Bulletin) విడుదల చేశారు. ప్రస్తుతం వెంటిలేటర్ సాయం లేకుండానే శ్రీతేజ్ శ్వాస తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. బాలుడికి అప్పుడప్పుడు జ్వరం వస్తోందని.. శుక్రవారంతో పోల్చితే ఇవాళ శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడినట్లు వెల్లడించారు. అలాగే ఆహారాన్ని కూడా తీసుకోగలుగుతున్నాడని.. నాడీ వ్యవస్థ కూడా స్థిరంగా పనిచేస్తోంది అని వివరించారు.
కాగా బాలుడి వైద్యం ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి(Komatireddy Venkat Reddy) అసెంబ్లీలో ప్రకటించారు. ఈమేరకు కిమ్స్ ఆస్పత్రికి చేరుకున్న కోమటిరెడ్డి శ్రీతేజను పరామర్శించారు. అనంతరం బాలుడి తండ్రికి రూ.25 లక్షల చెక్ మంత్రి అందించారు. ఈ క్రమంలో.. శ్రీతేజ కుటుంబానికి అన్ని రకాల సహాయం అందిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ ఘటనకు హీరో అల్లు అర్జున్ కారణమంటూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.