పౌరుల భద్రత కంటే సినిమా ప్రమోషన్స్ ముఖ్యం కాదని తెలంగాణ డీజీపీ జితేందర్(DGP Jitender) తెలిపారు. అల్లు అర్జున్(Allu Arjun) ప్రెస్ మీట్‌పై ఆయన పరోక్షంగా స్పందించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా తాము ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. పౌరుల భద్రత, రక్షణ అన్నింటికంటే ముఖ్యమని స్పష్టం చేశారు. ఆయన సినీ హీరో కావొచ్చు కానీ క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచించారు.
ఇలాంటి ఘటనలు పౌరుల భద్రతకు మంచిది కాదని హితవు పలికారు. ప్రజల భద్రత కంటే సినిమా ప్రమోషన్ ముఖ్యమైన అంశం కాదని ఆయన వెల్లడించారు. అల్లు అర్జున్‌పై చట్టప్రకారమే చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఇక నటుడు మోహన్ బాబు అరెస్టు అంశంపై కూడా ఆయన మాట్లాడారు. మీడియా ప్రతినిధిపై దాడి కేసులో మోహన్ బాబుపై(Mohanbabu) చట్టప్రకారం చర్యలు ఉంటాయని చెప్పారు.