సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలుగు సినీ ఇండస్ట్రీపై(Film industry) పగబట్టినట్లు వ్యవహరిస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శించారు. సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మృతిని అందరూ తీవ్రంగా ఖండించారని.. అలాగే ఆమె కుమారుడు శ్రీతేజ్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారని తెలిపారు. అయితే ఇప్పుడు అసెంబ్లీలో ఎంఐఎం(MIM) సభ్యుడితో ప్రశ్న అడిగించి సినిమా తరహా కథ అల్లి మళ్లీ సమస్యను రేవంత్ సృష్టించారని మండిపడ్డారు. ఓ ప్లానింగ్ ప్రకారం అసెంబ్లీ వేదికగా సినీ ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేశారని.. మీరో అల్లు అర్జున్ వ్యక్తిత్వ హననం చేసేలా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఎంఐఎం ఐరన్ లెగ్ పార్టీ అని.. గతంలో బీఆర్ఎస్ పంచన చేరి ఆ పార్టీని నిండా ముంచిందన్నారు. అలాంటి ఎంఐఎం పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్‌కు అదే గతి పడుతుందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు చనిపోతే.. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైన వారి కుటుంబాలను పరామార్శించారా అని ప్రశ్నించారు. హాస్టళ్లలో పురుగుల అన్నం తిని, పాముకాటుకు గురై నిత్యం విద్యార్థులు చనిపోతుంటే మీరెన్నడైనా బాధ్యత వహించారా..? అని నిలదీశారు. ఇప్పటికైనా అల్లు అర్జున్(Allu Arjun) తో పాటు సినిమా ఇండస్ట్రీ విషయంలో కక్ష సాధింపు చర్యలను వీడాలని సూచించారు.