Saturday, November 23, 2024
Homeనేరాలు-ఘోరాలుHyd: బ్లాక్ మార్కెట్లో హార్మోన్ ఇంజెక్షన్స్, ప్రిస్క్రిప్షన్ లేకుండానే విక్రయాలు

Hyd: బ్లాక్ మార్కెట్లో హార్మోన్ ఇంజెక్షన్స్, ప్రిస్క్రిప్షన్ లేకుండానే విక్రయాలు

నగరంలోని బ్లాక్ మార్కెట్లో హార్మోన్ ఇంజెక్షన్ల దందా జోరుగా సాగుతోంది. కండలు త్వరగా పెంచాలనే యువతే లక్ష్యంగా ఈ దందాకు తెరలేచింది. హార్మోన్ ఇంజెక్షన్లు, టాబ్లెట్లను విక్రయిస్తున్న నిందితులను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ చక్రవర్తి గుమ్మి తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నంకు చెందిన ఓంప్రకాశ్ (40) గతంలో జిమ్ ట్రైనర్ గా పనిచేశాడు. అమీర్ పేటలో ప్రొటీన్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. లగ్జరీ జీవితం కోసం వచ్చే సంపాదన చాలక పోవడంతో హార్మోన్ ఇంజెక్షన్లకున్న డిమాండ్ ను సొమ్ము చేసుకోవాలని భావించాడు. అదే విషయాన్ని తన సన్నిహితుడు అవినాశ్ కు తెలిపాడు. అవినాశ్ ఫార్మసీ వ్యాపారం చేస్తుండడంతో అందుకు అంగీకరించాడు. వారిద్దరూ కలిసి నగరంలోని జిమ్ లకు సప్లిమెంటరీలను సరఫరా చేసే నరేశ్ తో పాటు బేగంబజార్లోని జిమ్ ట్రైనర్ సయ్యద్ ఫారూఖ్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. వారి ద్వారా ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా అధిక ధరలకు హార్మోన్ ఇంజెక్షన్లు, టాబ్లెట్లు విక్రయించడం ప్రారంభించారు.

- Advertisement -

విశ్వసనీయ సమాచారం మేరకు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి లక్ష రూపాయలు విలువ చేసే హార్మోన్ మందులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఓంప్రకాశ్, నరేశ్, ఫారూఖ్, అవినాష్ లను ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారని టాస్క్ ఫోర్స్ డీసీపీ వెల్లడించారు.
హార్మోన్ మందులతో గుండెపై దుష్ప్రభావం..
హార్మోన్ ఇంజెక్షన్ లు తీసుకోవడం వల్ల గుండెపై దుష్ప్రభావం పడుతుందని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ చక్రవర్తి గుమ్మి హెచ్చరించారు. గుండెపోటు, అధిక రక్తపోటు వంటి ప్రమాదాలు ఏర్పడతాయని సూచించారు. సహజ సిద్ధంగా, బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా సమయానుగుణంగా శరీర సౌష్ఠవాన్ని పెంచుకోవాలని అన్నారు. హార్మోన్ ఇంజెక్షన్లు, టాబ్లెట్ల విషయంలో జిమ్ ట్రైనర్లు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎటువంటి అనుమానాలున్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News