హీరో అల్లు అర్జున్(Allu Arjun)పై తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Aadi Srinivas) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలను తప్పు పట్టేలా అల్లు అర్జున్ మాటలు ఉన్నాయని మండిపడ్డారు. అల్లు అర్జున్‌లో కనీసం పశ్చాత్తాపం కనిపించట్లేదని ఫైర్ అయ్యారు. పోలీసులు చెప్పినా వినకుండా అల్లు అర్జున్ థియేటర్‌లో షో చేశారని విమర్శించారు. ప్రజల ప్రాణాల కంటే ఆయనకు పేరు ప్రతిష్ఠలు ఎక్కువా?అని ప్రశ్నించారు.
సమాజంలో అల్లు అర్జున్ గురించి ఏమనుకుంటున్నారో అడిగి చూడమని ఆయన హితవు పలికారు. వ్యక్తిగత ప్రతిష్ట గురించే తప్ప చనిపోయిన రేవతి, ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాబు గురించి ఆలోచన లేదని ధ్వజమెత్తారు. అల్లు అర్జున్ ఇంకా దబాయించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇక అల్లు అరవింద్ మాట్లాడుతున్న తీరు సిగ్గుతో తలదించుకునేలా ఉందన్నారు. తన కొడుకు రెండు వారాలుగా మూడీగా ఉంటున్నారని అంటున్నారని.. కానీ అవతల ఓ బాలుడి ప్రాణం ఐసీయూలో ఉలుకు పలుకు లేకుండా పడి ఉందని గుర్తు చేశారు.