తెలుగు రాష్ట్రాల్లో హీరో అల్లు అర్జున్(Allu Arjun)ఎపిసోడ్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అన్ని పార్టీల్లో అల్లు అర్జున్ గురించే చర్చ జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీలో అల్లు అర్జున్ వ్యవహారశైలిపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. వెంటనే బన్నీ కూడా ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ వ్యాఖ్యలను పరోక్షంగా కొట్టిపారేశారు. అయితే అల్లు అర్జున్ వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.
తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (KomatiReddy Venkat Reddy) అల్లు అర్జున్‌పై ఫైర్ అయ్యారు. తక్షణమే సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తన వ్యక్తిగత ఇమేజ్ దెబ్బతీశారంటూ సీఎం వ్యాఖ్యలను ఎదురుదాడి చేయడం సరికాదన్నారు. బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు లీగల్ టీమ్ ఒప్పుకోలేదనటం హాస్యాస్పదమన్నారు. ఇక కనీసం శ్రీతేజ్‌ను మెగాస్టార్ చిరంజీవి అయినా పరామర్శించాల్సిందని తెలిపారు. ఎలాంటి గాయాలు లేకున్నా.. ఓరోజు జైలుకు వెళ్లి వచ్చినందుకే అల్లు అర్జున్‌ను ఇండస్ట్రీ అందరూ పరామర్శించడం ఏంటని మండిపడ్డారు.