Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Opposition Unity: ఐక్యత సాధ్యం కాకపోతే ఏమవుతుంది?

Opposition Unity: ఐక్యత సాధ్యం కాకపోతే ఏమవుతుంది?

ఒకవేళ 2024 లోక్‌సభ ఎన్నికల లోగా ప్రతి పక్షాల మధ్య ఐక్యత సాధ్యం కాకపోతే ఏమవుతుంది? ఇది దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతమే అవుతుంది. ఆ తర్వాత 2029 ఎన్నికల నాటికి ప్రతిపక్షాలే ఉండవు. ముఖ్యంగా జాతీయ స్థాయిలో మాత్రం ప్రతి పక్షమనేది ఉండదు. దాదాపు తుడిచిపెట్టుకుపోతుంది. దేశంలో చాలామంది రాజకీయ విశ్లేషకులు, మీడియా ప్రముఖులు, మేధావులు ఇదే రకమైన ఆలోచనలో ఉన్నారు. ఈ మధ్య రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రతో కొంత హుషారు తెచ్చుకున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, దేశం అధ్వాన స్థితిలో ఉన్నప్పుడు తాము లావాలా ఉప్పొంగుతామని ఇటీవల రాయ్‌పూర్‌లో జరి గిన కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశంలో ఉద్ఘాటించారు. ఇది ‘యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత&’ అనే శ్రీకృష్ణుడి గీతా ప్రవచనానికి దగ్గరగా ఉంది. దేశం సమ స్యలో కూరుకుపోయినప్పుడు కాంగ్రెస్‌ కదన రంగంలోకి పులిలా దూకుతుందనే మాటలు వినడానికి సొంపుగా ఉండవచ్చు కానీ, ఆచరణకు మాత్రం అందడం లేదు. సాధారణ ప్రజలు ఇప్పటికీ తమ వెనుకే ఉన్నారని చెప్పు కుంటున్న ఈ చరిత్రాత్మక జాతీయ పార్టీ దేశ సమస్య లెన్నింటికో పరిష్కారం కనుగొన్నామని చెబుతోంది కానీ, సంస్థాగత సమస్యలను మాత్రం పరిష్కరించుకోలేక పోతోంది.
ఒక విధంగా చెప్పాలంటే, దేశంలోని అనేక ప్రతి పక్షాలలో కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు, కొత్త వ్యూ హాలు కలికానికి కూడా కనిపించడం లేదు. వాటి వ్యవహార శైలిలో, ఆలోచనా ధోరణిలో ఎటువంటి మార్పూ చోటు చేసుకోలేదు. మారుతున్న రాజకీయ, ఆర్థిక,సామాజిక పరిస్థితులకు అనుగుణంగా తమ సిద్ధాంతాలను మెరుగు పరచుకుంటున్న లేదా సంస్కరించుకుంటున్న దాఖలాలు కూడా లేవు. నిజానికి, 2024 లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.ప్రతిపక్షాలన్నీ సంఘటితం అయితే తప్ప బీజేపీని ఢీకొనడం సాధ్యం కాదని కార్యకర్తలకు కూడా అర్థమవుతున్నప్పటికీనాయకుల్లో మాత్రం దానిని అర్థం చేసుకున్న నిదర్శనాలు లేవు. ఐక్యత కోసం కొన్ని పార్టీలు చిన్నా చితకా సూచనలు చేయడం, సంకేతాలివ్వడం జరిగింది కానీ, అగ్ర నాయకులెవరూ ఒక్క అడుగు కూడా ముందుకు వేసిన పాపాన పోలేదు. ఏ ప్రయత్నం చేసినా అది తాత్కాలికమే. ఐక్యతా ప్రయత్నాలకు సంబంధించి నంత వరకూ ఎక్కడ చూసినా నిరాశావాదమే కనిపిస్తోంది. సంశయాత్మకత పెరిగిపోతుంది.
కాంగ్రెస్‌లో భయాందోళనలు
విచిత్రమేమిటంటే, ఐక్యత గానీ, పొత్తులు గానీ లేనిదే విజయం సాధించడం కష్టమని అధిక సంఖ్యాక అభ్యర్థు లకు కూడా భయం కలుగుతోంది. మరి కొందరు అభ్య ర్థులు తాము ఎంతో జాగ్రత్తగా తమ నియోజక వర్గాలలో కాపాడుకుంటూ వస్తున్న పలుకుబడిని, సుహృద్భావాన్ని ఐక్యత కారణంగా ఇతర పార్టీల అభ్యర్థులు డేగల్లా తన్నుకు పోయే ప్రమాదం ఉందవని ఆందోళన చెందుతు న్నారు. బీజేపీ అభ్యర్థుల మీద తాము విజయం సాధిం చడం ఖాయమనే అభిప్రాయంలో కూడా కొందరున్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ గనుక బీజేపీని ఏదో విధంగా నిల దీయగలిగితే, ఆ పార్టీ మీద పైచేయి సాధించగలిగితే ఇక రాష్ట్రాలలో తమకు ఎదురు ఉండదని ఎదురు చూస్తున్న వారు కూడా లేకపోలేదు. ఎన్నికల లోగా బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ గట్టి దెబ్బతీయడం మీద చాలా మంది ఆశలు పెట్టుకుని ఉన్నారు.
ప్రతిపక్షాల మధ్య ఎన్నికలలోగా ఐక్యత సాధించడం ప్రస్తుతం అన్ని పార్టీలకు ఒక ఆశాజ్యోగిగా కనిపిస్తోంది. ఐక్యత అనేది ‘పరిపూర్ణ వివాహం’ కాకపోవచ్చు. కానీ, పార్టీల మధ్య కొద్దో గొప్పో నమ్మకం ఏర్పడినా గండం గట్టెక్కవచ్చనే అభిప్రాయం కాంగ్రెస్‌లోనూ కనిపిస్తోంది. ఐక్యతకు షరతులు పెట్టడానికి ఇక సమయం కూడా లేదు. అతి వేగంగా అడుగులు వేయడం, నిర్ణయాలు తీసు కోవడం ఇప్పుడు చాలా అవసరంగా కనిపిస్తోంది. వాస్తవా నికి బీజేపీ పుణ్యమాని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే ఐక్యత కోసం అనేక త్యాగాలు చేసింది. ఎన్నో పర్యాయాలు ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీల ఒత్తిడికి తలవంచి రాజీపడింది. ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపి, వాటి ద్వారా బీజేపీకి పగ్గాలు వేయడానికి మాత్రమే ఇప్పుడు ఆ పార్టీకి అవకాశం ఉంది.
ముమ్మరంగా ఐక్యతా ప్రయత్నాలు
కాంగ్రెస్‌తో సహా ఇతర ప్రతిపక్షాలతో సమానంగా బీజేపీ కూడా కొన్ని ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుని దూసుకు పోతున్న విషయాన్ని విస్మరించకూ డదు. తమ వలయంలోకి వచ్చిన పార్టీలతో ఐక్యతా ప్రయత్నాల విషయంలో బీజేపీ ఎప్పుడు చూసినా ఒక్క అడుగు ముందే ఉంటోంది. కాంగ్రెస్‌ను మరింత వంచి, మరింతగా రాజీ పడేట్టు చేసి, దానినుంచి మరిన్ని సీట్లు రాబట్టుకోవాలన్నదే ప్రతిపక్షాల ధ్యేయంగా కనిపిస్తోంది తప్ప భవిష్యత్తులో తమకు ఎదురయ్యే ప్రమాదాల గురించి వాటికేమీ పట్టడం లేదు. ఈ ధోరణికీ, కూర్చున్న కొమ్మను నరుక్కోవడానికీ పెద్ద తేడా ఏమీ లేదు. పొత్తుల్ని జీర్ణించు కోవడానికి పార్టీల కార్యకర్తలకు కొంత సమయం పట్ట వచ్చు. ఈ లోగా నాయకుల మధ్య సయోధ్య, సామరస్యం ఏర్పడడానికి చిన్నా చితకా ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఉంది. షరతుల కంటే మేలి కలయికకే ప్రాధా న్యం ఇవ్వాలి. పాత కక్షలను తవ్వుకునే కంటే సామర స్యానికే పెద్ద పీట వేయాలి. అదే విధంగా, మీన మేషాలు లెక్కపెడుతూ ఉంటే కంటే సత్వర నిర్ణయాలు తీసుకోవడా నికే ప్రాముఖ్యం ఇవ్వాలి. ఆలస్యం చేసే కొద్దీ అమృత మంతా విషం అయిపోతుంది.
అతి త్వరలో ఎదురు కాబోతున్న విపత్కర పరిస్థితిని ప్రతిపక్షాలు త్వరగా అర్థం చేసుకోవాల్సి ఉంది. ‘ఐ లవ్‌ యూ’ అని ఎవరు ముందు చెబుతారా అని ఎదురు చూడడం మంచిది కాదు. ఎవరో ఒకరు పిల్లి మెడలో గంట కట్టేయడమే శ్రేయస్కరం. పార్టీలలో ఎవరు సరైన అధికార ప్రతినిధులనేది గుర్తించి వారి ద్వారా ఐక్యతా ప్రయత్నాలు జరపాలి. అప్పుడప్పుడూ కాకుండా నిరంతరాయంగా చర్చలు జరపాల్సి ఉంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇందుకు కాంగ్రెసే నడుం బిగించాలి. నిజానికి, అనేక ప్రాంతీయ పార్టీలు కాంగ్రెసే ముందు డుగు వేయాలనే,చొరవ తీసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నాయి. ఆ పార్టీకి అనేక రాష్ట్రాలలో అధికారం లేకపో వచ్చు. ఈ మధ్య కాలంలో అనేక పరాజయాలు చవి చూసి ఉండవచ్చు. కానీ, ఈ పార్టీకి ఉన్నంత అనుభవం మరే పార్టీకీ లేదనడంలో సందేహం లేదు.
– డాక్టర్‌ వి. విశ్వేశ్వర రావు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News