హీరో అల్లు అర్జున్(Allu Arjun) ఇంటిపై ఓయూ జేఏసీ నాయకులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇంటి గోడలు ఎక్కి రాళ్లు రువ్వడంతో పాటు గేటు లోపలికి దూసుకెళ్లి పూలకుండీలు ధ్వంసం చేశారు. అనంతరం ఇంటి ముందు భైఠాయించి నిరసన చేపట్టారు. రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని నినాదాలు చేస్తున్నారు. ఈ దాడిని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(KomatiReddy Venkat Reddy) తీవ్రంగా ఖండించారు.
“సినీ ప్రముఖుల ఇళ్ల పై దాడి ఘటనను ఖండిస్తున్నాను. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్ ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి” అని సీఎం ట్వీట్ చేశారు.
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఈ దాడిని ఖండిస్తూ ట్వీట్ చేశారు. “సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావులేదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించకూడదు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన అంశం కోర్టులో ఉంది చట్టం తన పని తాను చేసుకుపోతుంది” అని తెలిపారు.