Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్SC on EC recruitment: సకాలంలో సరైన ఆదేశాలు

SC on EC recruitment: సకాలంలో సరైన ఆదేశాలు

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశంలో ఎన్నికలు సజావుగా, సక్రమంగా జరగడానికి వీలుగా ఎన్నికల కమిషన్‌ను మార్చడం నిజంగా సకాలంలో తీసుకున్న సరైన చర్య అని చెప్పక తప్పదు. ఇప్పుడిక ఎన్నికల కమిషన్‌ ఎటువంటి చర్య తీసుకున్నా సందేహించడానికి ఆస్కారం ఉండదు. ఎన్నికల కమిషనర్లను నియమించడానికి ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించడం ప్రశంస నీయమైన చర్య. ప్రధానమ్రంతి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిలతో కూడిన ఒక ప్యానెల్‌ సిఫారసు చేసిన వారినే రాష్ట్రపతి చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌, ఇద్దరు కమిషనర్లను నియమించాలని అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు పార్లమెంట్‌ చట్టంచేసే వరకూ ఇదే ఏర్పాటు కొనసాగాలని కూడా న్యాయ స్థానం ఆదేశించింది. ప్రస్తుతం కేంద్ర మంత్రి మండలి సిఫారసు చేసినవారిని మాత్రమే చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా, కమిషనర్లుగా నియమించడం జరుగుతోంది.
ఈ నియామకాలలో భారత ప్రధాన న్యాయమూర్తికి, ప్రతిపక్ష నాయకుడికి ప్రమేయం కల్పించడం వల్ల ప్రధాన ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా, విశ్వసనీయంగా వ్యవహరించడానికి అవకాశం కలుగుతుంది. అంతే కాదు, అనవసర, అవాంఛిత రాజకీయ జోక్యానికి అతీతంగా విధులు నిర్వర్తించడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. స్వేచ్ఛగా, సజావుగా,. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడమే ఎన్నికల కమిషన్‌ ప్రధాన కర్తవ్యమైనప్పటికీ, ఇది తరచూ వివాదాలకు గురవుతోంది. ఇది పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ ఏడాది కొన్ని శాసనసభలకు, 2024లో లోక్‌సభకు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌పై ఆరోపణలు, విమర్శలు మరింతగా పేట్రేగిపోతున్నాయి. ఎన్నికల కమిషన్‌ పక్షపాతంగా, ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ వివిధ పార్టీలు ఫిర్యాదులుచేస్తున్నాయి. ఎన్నికలలో ధన బలం పెరగడం, రాజకీయాల్లో నేరస్థుల ప్రాబల్యానికి హద్దులు లేకుండా పోతుండడం వంటి పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన నియామకాలకు సరైన చట్టమంటూ ఉండాలని రాజకీయ పార్టీలు పట్టుబట్టకుండా ఉండడం వెనుక వీరి స్వార్థం ఎంతో ఉందని సుప్రీంకోర్టు అంతర్లీనంగా విమర్శించడాన్ని బట్టి దేశంలో ఎన్నికల పరిస్థితి ఏ విధంగా మార్పులు చెందుతోందో, ఏ విధంగా దిగజారుతోందో అర్థం చేసుకో వచ్చు. ‘అడుగులకు మడుగులెత్తే ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టుకుని చిరకాలం, కలకాలం పదవుల్లో, అధికారంలో కొనసాగాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి’ అని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం తప్పనిసరిగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలను శిరసావహించాల్సి ఉంటుంది. రాజ్యాంగ సూత్రాలకు తగ్గట్టుగా ఎన్నికల కమిషన్‌ స్వేచ్ఛగా, స్వతంత్రంగా, పారదర్శకంగా వ్యవహరించాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు. ఎన్నికల కమిషన్‌ స్వతంత్రంగా వ్యవహరించడానికి ఆర్టికల్‌ 324 కింద ఒక కొత్త చట్టాన్ని తీసుకు రావడం అనేది ‘అనివార్యమైన అవసరం’. ఇందుకు ప్రభుత్వం కృషి చేయడమే మంచిది.
ఇటువంటిది ఎన్నికల కమిషన్‌ పట్ల, ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల దేశ ప్రజలకు నమ్మకాన్ని పెంచుతుంది. కార్యనిర్వాహక వ్యవస్థ లేదా ప్రభుత్వ ప్రభావం నుంచి ఎన్నికల కమిషన్‌ విముక్తి చెందితేనే పారదర్శకంగా, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడానికి వీలవుతుంది. స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు జరగడంలోనే ప్రజాభిప్రాయం నిఖార్సుగా వెల్లడవుతుంది. ఎన్నికల కమిషన్‌ నిష్పాక్షికంగా, పారదర్శకంగా పని చేయడానికి దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఒక్క తాటి మీద నిలబడి సమర్థించాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్‌ ఎంత స్వచ్ఛంగాఉంటే దేశ ప్రజాస్వామ్యానికి అంత మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News