కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం మరోసారి రసాభాసగా మారింది. గతంలో లాగే ఇప్పుడు కూడా కుర్చీ ఫైట్ జరుగుతోంది. సమావేశానికి హాజరైన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డికి(Madavi Reddy) వేదికపై కుర్చీ ఏర్పాటు చేయలేదు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిలబడే ఉన్నారు. గతంలోనే ఇలాగే చేశారని.. తనకు కుర్చీ ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..వైసీపీకి చెందిన మేయర్ సురేశ్‌బాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళను మేయర్ అవమానపరుస్తున్నారని.. మహిళను అవమానిస్తే మీ నాయకుడు సంతోషిస్తారేమో అని ఫైర్ అయ్యారు. తన కుర్చీని లాగేస్తారని మేయర్ భయపడుతున్నారని.. అందుకే ఆయన కుర్చీలాట ఆడుతున్నారని విమర్శించారు. మహిళలంటే చిన్నచూపు లేకపోతే మహిళను ఎందుకు నిలబెట్టారని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో వేదికపై ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకున్నారని.. ఇప్పుడు ఎందుకు ఎమ్మెల్యేలకు కుర్చీలు ఏర్పాటుచేయలేదని నిలదీశారు.
ఈ క్రమంలో మేయర్ సురేశ్ బాబు, ఎమ్మెల్యే మాధవీరెడ్డికి మధ్య వాదోపవాదాలు సాగాయి. దీంతో టీడీపీ, వైసీపీ కార్పొరేటర్లు పోటాపోటీ నిరసనకు దిగారు. మేయర్‌కు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలంటూ వైసీపీ కార్పొరేటర్లు.. ఎమ్మెల్యేకు కుర్చీ ఇవ్వకపోవడంతో టీడీపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కార్యాలయ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు.