ఇకపై సినిమాలకు బెనిఫిట్ షోలు ఉండవని నిర్ణయం తీసుకోవడంపై తెలంగాణ సినీ ఎగ్జిబిటర్లు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మీడియా సమావేశంలో ఎగ్జిబిటర్స్ మాట్లాడుతూ… బెనిఫిట్ షోలు వేయడం కరెక్ట్ కాదన్నారు. బెనిఫిట్ షోల వల్ల ఎగ్జిబిటర్లకు ఆర్థికంగా నష్టం కలుగుతుందని వాపోయారు.
టికెట్ రేట్ల పెంపుతో నిర్మాతలకే తప్ప తమకు ఎలాంటి లాభం ఉండదని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో టికెట్ రేట్ల పెంపు ఉండదని తెలుగు రాష్ట్రాల్లోనే ఈ పరిస్థితి ఉందన్నారు. ఏ సినిమాకైనా నిర్ణీత మొత్తంలోనే టికెట్ ధరలు ఉండాలన్నారు. టికెట్ రేట్ల పెంపు వల్ల ప్రేక్షకులు ఓటీటీల్లో సినిమాలు చూసేందుకు మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు.
మరోవైపు బెనిఫిట్ షోలు ఉండవంటూ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఏపీ ఎగ్జిబిటర్లు సైతం హర్షం వ్యక్తం చేశారు. టికెట్ ధర పెంపు వల్ల ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరహాలోనే ఏపీ ప్రభుత్వం కూడా బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.