హీరో అల్లు అర్జున్(Allu Arjun) నటించిన ‘పుష్ప2’ సినిమా(Pushpa Movie)పై తెలంగాణ మంత్రి సీతక్క(Seethakka) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక స్మగ్లర్ పోలీసులను బట్టలు విప్పించి నిల్చోబెడితే జాతీయ అవార్డులు ఇస్తున్నారని.. ఇది దేనికి సంకేతం అని ప్రశ్నించారు. సమాజానికి ఉపయోగపడే ‘జై భీమ్'(Jai Bhim) లాంటి సినిమాలకు అవార్డులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి సినిమాకు ప్రోత్సహకాలు కూడా లేవన్నారు.
ఎర్రచందనం అమ్మే స్మగ్లర్‌ను హీరో చేసి ప్రజలు కోసం పోరాడే పోలీసులు, లాయర్లను విలన్‌లను చేశారని ఆమె మండిపడ్డారు. రెండు హత్యలు చేసిన నిందితుడు మహారాష్ట్రలో ‘పుష్ప2’ సినిమా చూస్తూ దొరికాడని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇలాంటి సినిమాలు సమాజంలో నేరాలు పెంచేలా ఉన్నాయని ఫైర్ అయ్యారు.
మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి కూడా ‘పుష్ప2’ మూవీపై హాట్ కామెంట్స్ చేశారు. NTR, ANR లాంటి మహానుభావులు దివిసీమ ఉప్పెన వల్ల గ్రామాలు గ్రామాలు మునిగిపోతే… సినిమా పరిశ్రమ తరపున జోలె పట్టారని గుర్తు చేశారు. అలాంటి వారికి వారసులం అని చెప్పే వీళ్ళు కనీసం మృతి చెందిన రేవతి కుటుంబానికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారా అని ప్రశ్నించారు. ప్రస్తుత హీరోలు ఏ గ్రామాలను కానీ.. ఆసుపత్రులను కానీ దత్తత తీసుకున్నారా అని నిలదీశారు. నైజాం ఏరియాలో ప్రజలు సినిమాలు చూడకపోతే సినిమా వాళ్లు అడుక్కు తింటారు అని హెచ్చరించారు.