Friday, November 22, 2024
Homeహెల్త్Castor oil: అందానికి ఆముదం నూనె

Castor oil: అందానికి ఆముదం నూనె

అమ్మమ్మలు, నానమ్మలున్న ఇళ్లల్లో ఇంట్లోని పసిపిల్లలకి ఆముదం నూనెతో మసాజ్ చేయడం చూస్తుంటాం. ఆముదం నూనె చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుతుందని పెద్దవాళ్లు తరచూ అనడం కూడా మనలో చాలామంది వింటూనే ఉంటాం. మరి ఆముదం నూనె అన్ని వయసుల వారి చర్మ సౌందర్యానికి, ఆరోగ్యానికి ఎలా ఉపకరిస్తుందో చూద్దాం…

- Advertisement -

_ ఆముద నూనెలో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీరాడికల్స్ తో పోరాటం చేస్తాయి. కారణం ఫ్రీరాడికల్స్ వల్ల తొందరగా వయసు మీద పడి, చర్మంపై ముడతలు ఏర్పడతాయి. ఆముదం నూనె ఒంటికి రాసుకుంటే చర్మం ముడతలు పడదు.

_ఈ నూనెలో యాంటీ బాక్టీరియల్ సుగుణాలు కూడా ఉన్నాయి. చర్మంపై ఉన్న బాక్టీరియాను ఇది పోగొడుతుంది. యాక్నే సమస్యను నివారిస్తుంది.

_ ఆముదంలో యాంటిఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. అందుకే కళ్ల కింద వాపు, ఉబ్బడం వంటి వాటిని తగ్గిస్తుంది.

_ఈ నూనెలో తేమ గుణాలు పుష్కలంగా ఉండడం వల్ల దీన్ని రాసుకుంటే ఎంతో యంగ్ గా, ఆరోగ్యవంతమైన చర్మంతో మిలమిల మెరిసిపోతుంటారు. ఈ నూనెలోని మాయిశ్చరైజింగ్ గుణం చర్మం ముడతలు పడకుండా పరిరక్షిస్తుంది.

_ సూర్య రశ్మి వల్ల ఏర్పడ్డ సన్ బర్న్స్ నొప్పుల నుంచి ఆముదం నూనె సాంత్వననిస్తుంది. అంతేకాదు ఇందులోని మాయిశ్చరైజింగ్ గుణం వల్ల చర్మం పొట్టులా ఊడదు కూడా.

_ లిప్ స్టిక్, లిప్ గ్లోస్ తయారీలో ఆముదం నూనెను ఒక పదార్థంగా వాడతారు. డ్రైలిప్స్ ఉన్నవాళ్లు పెదాలకు రంగు లిప్ స్టిక్స్ వాడకుండా ఆముదం నూనెను రాసుకుంటే పెదాలపై చర్మం ఎంతో నునుపుగా కనిపిస్తుంది.

_ ఆముదం నూనెలో శరీరారోగ్యాన్ని కాపాడే ఆరోగ్యకరమైన ఫ్యాటీ ఆమ్లాలు ఉన్నాయి. చర్మ ఆరోగ్యానికి, సంరక్షణకు ఫ్యాటీ ఆమ్లాలు చాలా అవసరం.

_ ముఖానికి ఆముదం నూనె రాసుకోవాలనుకుంటే ముందు దాంట్లో ఏదైనా క్యారియర్ ఆయిల్ ని అంటే కొబ్బరినూనె, బాదం లేదా ఆలివ్ నూనెలలో ఏదో ఒకదానిని ఆముదంలో కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఎక్స్ ట్రా మాయిశ్చరైజింగ్ ఎఫెక్టు కోసం అందులో షియా బటర్ కలిపితే ముఖం మీద చర్మం మిల మిలలాడుతుంది. రాత్రి పడుకోబోయే ముందు ముఖంపై ఉండే చర్మాన్ని శుభ్రంగా నీళ్లతో కడుక్కుని ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. రాత్రంతా దాన్ని అలాగే ఉంచుకోవచ్చు. లేదా ఈ నూనెను ముఖానికి పట్టించుకున్న ఐదు నిమిషాల తర్వాత గోరువెచ్చని గుడ్డతో ముఖాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి.

ఒక అధ్యయనం ప్రకారం ఆముదంలో యాంటి బాక్టీరియల్ గుణాలు, యాంటాక్సిడెంట్లు బాగా ఉన్నాయని వెల్లడైంది కూడా. ఆముదం వెజిటబుల్ ఆయిల్. ఆ మొక్క గింజల నుంచి దీన్ని తీస్తారు. ఈ నూనెలోని ఫ్యాటీ ఆమ్లాలు చర్మన్ని మెరిసేట్టు చేస్తాయి. ఈ నూనెను కనుబొమలకు, కనురెప్పలకు రోజూ రాయడం వల్ల వాటి వెంట్రుకలు ఒత్తుగా, పెరుగుతున్నాయని చాలామంది చెపుతున్నారు. యాక్నే, ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యల నివారణకు కూడా ఆముదం నూనెను ఉపయోగిస్తున్నారు. ఆముదం నూనె ఏజ్ స్పాట్స్ ను, చర్మంపై ముడతలను పోగొడుతుంది. పలు కాస్మొటిక్ ఉత్పత్తుల్లో సైతం ఆముదం నూనెను తయారీదారులు వాడుతున్నారు. ఆముదం నూనెలో కోల్డ్ ప్రెస్ట్ ఆముదం నూనె అని ఉంది. ఇది చూడడానికి ఎంతో స్వచ్ఛంగా కనిపిస్తుంది. రెండవది జమైకన్ బ్లాక్ కాస్టర్ ఆయిల్. ఇది ముదురు బ్రౌన్ రంగులో ఉంటుంది. పలు బ్యూటీ ట్రీట్మెంట్లలో జమైకన్ బ్లాక్ కాస్టర్ ఆయిల్ ని వాడుతున్నారు. ఈ రెండు రకాల ఆముదం నూనెలో ఒకేరకమైన సుగుణాలు ఉన్నాయి. ఇవి కనురెప్పల పెరుగుదలకు ఎంతో సహాయపడతాయి. కనురెప్పలను బాగా శుభ్రం చేసుకుని, వాటికి ఉన్న మేకప్ ను తొలగించిన తర్వాతే కనురెప్పలకు ఈ నూనెను రాయాలి.

ఆముదం నూనెలో ముంచిన కాటన్ బాల్ ని తీసి దానితో కనురెప్పలపై సున్నితంగా రాయాలి. ఆ సమయంలో ఆముదం నూనె కళ్లల్లో పడకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ కళ్లల్లో ఆముదం పడితే వెంటనే నీళ్లతో కళ్లను శుభ్రంగ కడిగేసుకోవాలి. లేకపోతే కళ్లల్లో ఇరిటేషన్ తలెత్తుతుంది. రాత్రిపడుకోబోయేముందు మాత్రమే దీన్ని కనురెప్పలకు రాసుకోవాలి. ఉదయం లేచిన తర్వాత మేకప్ రిమూవర్ తో కనురెప్పలను తుడిచేసుకోవాలి. లేదా చల్లటి నీళ్లతో కూడా కనురెప్పలను కడుక్కోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News