చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో హీరో అల్లు అర్జున్(Allu Arjun) విచారణ పూర్తి అయింది. విచారణలో పోలీసుల ప్రశ్నలకు బన్నీ సమాధానం దాటవేసినట్లు సమాచారం. దాదాపు మూడున్నర గంటల పాటు జరిగిన విచారణలో పోలీసులు ఏ ప్రశ్న అడిగినా.. తెలియదు.. మర్చిపోయాను అని సమాధానం ఇచ్చినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన 10 నిమిషాల వీడియోను అల్లు అర్జున్‌కి చూపించి విచారణ చేశారు.
తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు తెలుసు కదా అని ప్రశ్నించగా.. నోరు మెదపలేదని తెలుస్తోంది. ఘటన జరిగిన తర్వాత రోజు వరకు తనకు తెలియదని మీడియాకు ఎందుకు చెప్పారని అడగగా.. సైలెంట్‌గానే ఉన్నట్లు సమాచారం. ఏసీపీ రమేశ్, ఇన్‌స్పెక్టర్ రాజునాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ఆయన్ను ప్రశ్నించారు. మళ్లీ విచారణకు పిలిస్తే అందుబాటులో ఉండాలని సూచించారు. కాగా సంధ్య థియేటర్ సీన్ రీ కన్‌స్ట్రక్షన్ ఇవాళ లేనట్లు పోలీసులు తెలిపారు.