తాను అసలు క్రీడాకారిణిగా కాకుండా ఉండాల్సిందని మను భాకర్(Manu Bhaker) తనతో వాపోయిందని ఆమె తండ్రి రామ్ కిషన్ భాకర్ తెలిపారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఖేల్ రత్న(Khel Ratna) అవార్డుల నామినీ జాబితాలో తన పేరు లేకపోవడంపై మను భాకర్ తీవ్ర అసంతృప్తికి లోనైందని పేర్కొన్నారు. తాను ఒలింపిక్స్‌కు వెళ్లకుండా మెడల్స్ సాధించకపోయినా బాగుండేదని వాపోయిందన్నారు. దేశానికి రెండు ఒలింపిక్ మెడల్స్ సాధించినా తన కూతురుకు తగిన గుర్తింపు రాలేదన్నారు. రెండు ఒలింపిక్స్ మెడల్స్‌ను ఒకే ఎడిషన్‌లో సాధించిందని.. ఇప్పటి వరకు ఈ ఘనతను ఎవరూ సాధించలేదని గుర్తు చేశారు. అయినప్పటికీ ఆమె పేరును ఖేల్ రత్న అవార్డు పరిశీలనకు తీసుకోకపోవడం సరికాదని మండిపడ్డారు.
తన కూతురుకు షూటింగ్ నేర్పించినందుకు తాను ఇప్పుడు చింతిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. షూటింగ్‌లో కాకుండా క్రికెట్‌లో ప్రోత్సహించి ఉంటే బాగుండేదని అప్పుడు అన్ని అవార్డులు ఆమెను వెతుక్కుంటూ వచ్చి ఉండేవన్నారు. కాగా ఖేల్ రత్న అవార్డు కోసం మను బాకర్ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా తన పేరును నమోదు చేసింది. ఖేల్ రత్నతో పాటు పద్మ శ్రీ, పద్మ భూషణ్ అవార్డులకు సైతం పేరు నమోదు చేసుకుంది. అయితే ఇటీవల క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఖేల్ రత్న నామినీల జాబితాలో మను పేరు లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.