ఏపీ, తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓబులాపురం గనుల్లో 2007 జులై 21న అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళ్లిన నేతలపై నమోదైన కేసుకు సంబంధించిన విచారణ జరిగింది. అందరూ ఇవాళ విచారణకు హాజరుకావాల్సిందేనని గత విచారణ సమయంలో న్యాయమూర్తి ఆదేశించారు.
దీంతో అభియోగాలు నమోదైన ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు నాగం జనార్ధన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయకర్‌రావు, దేవినేని ఉమామహేశ్వరరావు, నిమ్మకాయల చినరాజప్ప, పడాల అరుణ, అమర్‌నాథ్ రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, చిన్నం బాబురమేష్, కోళ్ల లలితకుమారి, బొమ్మడి నారాయణరావు, మసాల పద్మజ, పూల నాగరాజు, ముల్లంగి రామకృష్ణారెడ్డి, గురుమూర్తి, మెట్టు గోవిందరెడ్డి, యలమంచిలి బాబూరాజేంద్రప్రసాద్ కోర్టు ముందు హాజరయ్యారు. అనంతరం తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 8వ తేదీకి న్యాయాధికారి వాయిదా వేశారు
కాగా 2007 జులై 21న అనంతపురం జిల్లా డి.హీరేహళ్ మండలంలోని ఓబులాపురం ఇనుప గనుల పరిశీలనకు అప్పటి తెలుగుదేశం నేతలు ఓ బృందంగా వెళ్లినప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో బలమైన నేతలుగా ఉన్న నాగం జనార్ధన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు పాత మిత్రులను కలుసుకున్న తరుణంలో ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు.