బీసీ కులగణనపై తమ వైఖరి ఏంటో బీజేపీ పార్టీ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలు, కామారెడ్డి డిక్లరేషన్ అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీ ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. బీసీలంటే బీజేపీ పార్టీకి లెక్కలేదా అని అడిగారు.
కుమ్మరి సంఘం నేతలతో
గురువారం నాడు కుమ్మరి సంఘం నేతలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తన నివాసంలో కలిశారు. బీసీలు, ముఖ్యంగా కులవృత్తుల వారు ఎదుర్కొంటున్న సమస్యలను వారు ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని స్పష్టం చేశారు. కేసీఆర్ కులవృత్తులకు అన్ని విధాలా మద్ధతిచ్చారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కులవృత్తులను కుదేలు చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యంగా బీసీల సంక్షేమాన్ని, అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు.
42 శాతం రిజర్వేషన్స్ ఏమయ్యాయి?
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తున్నాబీజేపీ స్పందించకపోవడం శోచనీయమన్నారు. బీసీలు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్ లు అవ్వడం బీజేపీ పార్టీకి ఇష్టం లేదా అని ప్రశ్నించారు.
కేంద్రం చట్టం తేవాలి
బీసీ కులగణన విషయంలో ప్రభుత్వం తాత్సారం చేయడం సరికాదని సూచించారు. దేశవ్యాప్తంగా కులగణనకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్టం తీసుకొస్తే అన్ని రాష్ట్రాల్లో కులగణన జరుగుతుందని, కానీ కేంద్రం ఆ దిశగా అడుగులు వేయకపోవడం అంటే బీసీలపై ప్రేమ లేనట్లే మనం అర్థం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో యునైటెడ్ ఫులే ఫ్రంట్ నాయకులు బొల్ల శివ శంకర్, తెలంగాణ రాష్ట్ర శాలివాన సంఘ నాయకులు దుగుంట్ల నరేష్, నిమ్మలూరి శ్రీనివాస్ , రేపాక రాంబాబు, రావులకోల్ ఎన్ మరియు తెలంగాణ రాష్ట్ర ఆరెకటిక సంఘం నాయకులు హకీంకారి సురేందర్, జి. కే జహంగీర్, జీ. కే పరమేశ్వర్, ఏ వెంకటేశ్వర్, జి. కే అఖిల బాయి పాల్గొన్నారు