కూటమి ప్రభుత్వంపై పోరాటానికి ప్రతిపక్ష వైసీపీ(YCP) సిద్ధమవుతోంది. గత ఆరు నెలలుగా సైలెంట్‌గా ఉన్న ఆ పార్టీ ప్రభుత్వంపై వరుస పోరాటాలకు రెడీ అవుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ రూపొందించింది. ఈ నేపథ్యంలోనే విద్యుత్ ఛార్జీల పెంపుపై ఇవాళ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్(Jagan) పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిరసనకు దిగారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు కాకముందే ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపిందని మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu) విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పాటు జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించనున్నారు.