భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్(Manmohan Singh) పార్థివదేహానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరంద్ర మోదీ(PM Modi), కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, అమిత్ షా నివాళులర్పించారు. శుక్రవారం ఉదయం మన్మోహన్ నివాసానికి వెళ్లిన వీరు.. ఆయన భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక ఆర్మీ అధికారులు మన్మోహన్ పార్థివదేహంపై జాతీయ పతాకాన్ని కప్పి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఆర్థికవేత్తగా, సంస్కరణల సారథిగా మన్మోహన్ సింగ్‌ను దేశం గుర్తిస్తుందన్నారు. ఆర్‌బీఐ గవర్నర్ పదవి సహా అనేక కీలక పదవుల్లో దేశానికి సేవలందించారని కొనియాడారు. పీవీ నరసింహారావు మంత్రి వర్గంలో ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చివేశారని ప్రశంసించారు.