బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో (Border – Gavaskar Trophy 2024) భాగంగా భారత్-ఆస్ట్రేలియా(AUS vs IND) జట్ల మధ్య మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (82) పరుగులతో రాణించగా.. విరాట్ కోహ్లీ (36), కేఎల్ రాహుల్ (24) రన్స్ చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ(3) మరోసారి నిరాశపరిచాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ (24) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత్ 51 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, ఓపెనర్ యశస్వితో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరు కలిసి 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే జైశ్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అనవసరంగా రనౌట్ కావడంతో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే కోహ్లీ కూడా పెవిలియన్ బాటపట్టాడు. ఇక నైట్‌వాచ్‌మెన్‌గా వచ్చిన ఆకాశ్ దీప్ డకౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 164/5గా ఉంది. క్రీజులో రిషభ్ పంత్ (6), జడేజా (4) ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బొలాండ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఆసీస్ కంటే భారత్ ఇంకా 310 పరుగుల వెనుకంజలో ఉంది.
అంతకుముందు ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్ లో 474 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్‌నైట్ స్కోర్ 311/6 తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆతిథ్య జట్టు మరో 163 పరుగులు జోడించి మిగతా 4 వికెట్లు కోల్పోయింది. స్టీవ్ స్మిత్(140)పరుగులతో అదరగొట్టగా.. కాన్‌స్టాస్ (60), ఉస్మాన్ ఖావాజా (57), లబుషేన్ (72) అర్ధ శతకాలు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు పడగొట్టగా. రవీంద్ర జడేజా 3, ఆకాశ్ దీప్ 2, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశారు.