చర్లపల్లిలో నిర్మించిన నూతన రైల్వే టెర్మినల్(Cherlapally Railway Terminal) ప్రారంభోత్సవం వాయిదా పడింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) కన్నుమూయడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. త్వరలోనే ప్రారంభోత్సవ తేదీని ప్రకటిస్తామని తెలిపారు. వాస్తవంగా ఈనెల 28న రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ రైల్వే టెర్నినల్‌ను ప్రారంభించాల్సి ఉంది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. తాజాగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కాగా హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లలో రైల్వే ప్రయాణికుల ఒత్తిడిని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే రూ.4288 కోట్లతో అత్యాధునిక వసతులతో నిర్మించింది. స్టేషన్ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆరు బుకింగ్ కౌంటర్లు, మహిళలు, సీనియర్ సిటిజన్స్ కోసం స్పెషల్ వెయిటింగ్ హాల్స్, హై క్లాస్ వెయిటింగ్ లాంజ్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్‌లో రెస్టారెంట్, రెస్ట్ లాంజ్ ఏర్పాటు చేశారు. విశాలమైన కాన్కోర్స్ ఏరియాలు, అద్భుతమైన లుక్, అదిరిపోయే లైటింగ్, ఆధునిక ఎలివేషన్‌తో నిర్మించారు.
రెండు విశాలమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటి 12 మీటర్ల వెడల్పు, మరొకటి 6 మీటర్ల వెడల్పు ఉంటాయి. మొత్తం తొమ్మిది ప్లాట్ ఫారమ్‌లు నిర్మించారు. మొత్తం ఏడు లిఫ్టులు, ఆరు ఎస్కలేటర్లు నిర్మించారు. ఇక ఈ రైల్వే టెర్మినల్‌లో నాలుగు అదనపు హై-లెవల్ ప్లాట్ ఫారమ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఐదు ప్లాట్ ఫారమ్‌లు కూడా పూర్తి రైళ్లను ఉంచడానికి విస్తరించారు. అదనంగా 10 లైన్లు ఏర్పాటు చేశారు. దీంతో ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్ లో మొత్తం 19 రైల్వే లైన్లు ఉన్నాయి.