Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్EBC reservations: చరిత్రాత్మక తీర్పుతో సామాజిక న్యాయం, సామాజిక పునర్నిర్మాణానికి నాంది

EBC reservations: చరిత్రాత్మక తీర్పుతో సామాజిక న్యాయం, సామాజిక పునర్నిర్మాణానికి నాంది

ఆర్థిక బలహీన వర్గాలకు రిజర్వేషన్ కోటా వర్తింపజేయటంపై ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన చరిత్రాత్మక తీర్పు దేశంలో కొద్దిపాటి సంచలనం సృష్టించిన మాట వాస్తవం. అయితే, ఇది సామాజిక న్యాయానికి దర్పణం పడుతోందన్నది అత్యధిక సంఖ్యాకుల అభిప్రాయంగా కనిపిస్తోంది. రాజ్యాంగంలో రిజర్వేషన్ కు సంబంధించిన నిబంధన మార్చకూడదనే నియమం ఎక్కడా లేదు. ఈ నిబంధన సడలింపదగినదే. రిజర్వేషన్ వ్యవస్థను రాజ్యాంగంలో ప్రత్యేకంగా పొందుపరచడానికి ప్రధాన కారణం సామాజిక పునర్నిర్మాణమే ధ్యేయం.

- Advertisement -

హోదాల పరంగా, స్థాయిల పరంగా, సాంస్కృతికంగా, అవకాశాలపరంగా దేశంలో వేళ్లుపాదుకుపోయి ఉన్న అసమానతలను తగ్గించటమే రిజర్వేషన్ల లక్ష్యం. జీవితంలోని శుభ పరిణామాలన్నిటినీ అసమానంగా పంపిణీ చేయటం ఎంత దారుణ విషయమో అనుభవిస్తే కానీ అర్థం కాదని రాజ్యాంగ నిర్మాతలు గుర్తించి, దూరదృష్టితో రిజర్వేషన్ వ్యవస్థకు అంకురార్పణ చేయడం జరిగింది. పేదరికం, ఆకలి, అనారోగ్యం, అజ్ఞానం వంటివి తరతరాలుగా రాజ్యమేలుతున్న దేశంలో ‘మంచి’ని అందరికీ సరిసమానంగా పంచాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది. రాజ్యాంగం ఇదే సుదుద్దేశంతోనే రిజర్వేషన్ వ్యవస్థను నిర్దేశించింది. సౌకర్యాలు, అవకాశాలు, అధికారాలు, హోదాలు, సంపద వంటివి ఏ కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం కాకూడదనేది రాజ్యాంగ నిర్మాతల నిశ్చితాభిప్రాయం. సామాజిక, ఆర్థిక అసమానతలు దేశాన్నిపట్టి పీడిస్తున్న కీలక సమమస్యలనడంలో సందేహం లేదు. ఆర్థికంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని విస్తరించడమనేది ఈ దిశగా మరో ముఖ్యమైన అడుగు.

సామాజిక న్యాయమనేది రాజ్యాంగ నిర్మాతలు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన కీలకాంశం. చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ బలహీన, బడుగు వర్గాలకు అవకాశాలివ్వాలని రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరైన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గట్టి పట్టుదలతో ఉండేవారు. మన సుసంపన్న సాంస్కృతిక చరిత్రకు అన్యాయం, అణచివేతలు మాయని మచ్చలు. ఇక కుల వివక్ష ఉండనే ఉంది. రిజర్వేషన్ వ్యవస్థే లేకపోయి ఉంటే దేశంలోని కోట్లాది మంది బలహీన, బడుగు వర్గాల ప్రజల జీవన పరిస్థితులు ఎంత దుర్గతిలో ఉండేవో చెప్పలేం. అందరినీ కలుపుకుని పోవడం అనేది సామాజిక వ్యవస్థకు పరిపుష్టత చేకూరుస్తుంది. ఆర్థికంగా బలహీన వర్గాల కోసం రాజ్యాంగాన్ని సవరించటం ఏ విధంగానూ రాజ్యాంగం అతిక్రమించటం కాబోదంటూ న్యాయమూర్తి దినేశ్ మహేశ్వరి చేసిన వ్యాఖ్యలు అర్థవంతమైనవి. దేశంలో ప్రస్తుతం ఉన్న సామాజిక అసమానతలను రామ్ మనోహర్ లోహియా వంటి అగ్రశ్రేణి సోషలిస్ట్ నాయకులు తీవ్రంగా గర్హించారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారికి తగిన న్యాయం అందించడానికి పలువురు మేధావులు, నాయకులు, సంస్కర్తలు కొన్ని వందల ఏళ్ల నుంచి పోరాటాలు సాగిస్తున్నా అది అందని ద్రాక్ష పండే అయింది. అయితే, రాజ్యాంగ నిర్మాతలు ఎంతో దూరదృష్టితో, దూరాలోచనతో రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించి ఈ వర్గాలను ఆదుకోవడం ప్రపంచ చరిత్రలోనే అరుదైన, అద్వితీయమైన అంశం.

ఆదివాసీలకు చెందిన ఓ మహిళ దేశ రాష్ట్రపతి పదివిని అలంకరించడానికి మన దేశానికి ఏడున్నర దశాబ్దాలు పట్టిందంటే సామాజిక వివక్ష ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రపతి భవన్ లో ఒక దళితుడు అడుగుపెట్టడం, ఆతర్వాత ఒక ఆదివాసీ మహిళ అడుగు పెట్టడం దేశంలో సామాజికంగా వస్తున్న మార్పునకు అద్దం పడుతోంది. బడుగు వర్గాల జీవితాలు సానుకూల మలుపులు తిరుగుతున్నాయంటే అందుకు ప్రధాన కారణం రిజర్వేషన్ వ్యవస్థేననడంలో సందేహం లేదు. ప్రభుత్వం ఇటీవల కాలంలో సుమారు 47 కోట్ల మంది బలహీన వర్గాలతో బ్యాంకు అకౌంట్లను ప్రారంభింపచేయడం ఆర్థిక అస్పృశ్యతకు తెర దించింది. కుల మత ప్రసక్తి లేకుండా రెండు వందల కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేయడం కూడా సామాజిక న్యాయంలో భాగమే. “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్” కూడా సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించినదే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News