ఖతార్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ జరుగుతోంది. ఉత్కంఠభరితంగా సాగుతున్న మ్యాచ్‌లతో ఆయా జట్ల ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. విజయం సాధించిన జట్టు అభిమానులు స్టేడియంలోనే సంబరాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఫిఫా వరల్డ్ కప్ ఫివర్ పట్టుకుంది. అయితే, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జపాన్ ఫ్యాన్స్ , ఆ జట్టు ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రపంచ కప్‌లో జపాన్ జట్టు విజయం తరువాత ఫ్యాన్స్, క్రీడాకారులు చేసిన పనికి ప్రతీఒక్కరూ ఫిదా అవుతున్నారు.
ఫిఫా వరల్డ్ కప్ -2022లో భాగంగా బుధవారం జర్మనీ వర్సెస్ జపాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో జపాన్ విజయం సాధించింది. ఇంకేముంది స్టేడియం ఫ్యాన్స్ సంబరాలతో హోరెత్తుతుందని అందరూ భావించారు. కానీ జపాన్ ఫ్యాన్స్ చేసిన పనికి ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా జపాన్ ప్రజలు పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తారు. ఆ దేశంలో చిన్నతనం నుంచే వారిలో ఈ పద్దతి అలవాటుగా మారుతుంది. ఈ క్రమంలోనే జర్మనీపై జపాన్ విజయం సాధించిన తరువాత ఆ జట్టు అభిమానులు స్టేడియంలోని గ్యాలరీలో చెత్తను శుభ్రం చేశారు. మ్యాచ్ చూసే సమయంలో ఆహారపదార్థాలను తినిపడేయడం, కూల్ డ్రింక్స్ బాటిల్స్, ఇతర వస్తువుల ప్యాకెట్లు స్టేడియంలో పడేస్తారు. వీటిని తొలగించేందుకు స్టేడియం సిబ్బంది శ్రమించాల్సి వస్తుంది. వీటన్నింటిని జపాన్ ఫ్యాన్స్ శుభ్రం చేశారు.
స్టేడియంలో ప్రేక్షకులు వాడిపడేసిన వస్తువులను ప్లాస్టిక్ సంచుల్లో నింపుకొని ఓ చోటకు చేర్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో జపాన్ ఫ్యాన్స్ చేసిన పనికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. మరోవైపు జపాన్ ఆటగాళ్లుసైతం మేమేం తక్కువకాదని నిరూపించుకున్నారు. జర్మనీపై తొలిమ్యాచ్ లో విజయం తరువాత వారు తమ డ్రెసింగ్ రూంలో ఇష్టారీతిలో ఎంజాయ్ చేయడం మానుకొని, తమ రూంలను శుభ్రం చేసుకొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో జపాన్ ఫుట్‌బాల్ ప్లేయర్లు, వారి ఫ్యాన్స్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇతరులు స్ఫూర్తి పొందేలా చేశారంటూ తెగపొగిడేస్తున్నారు.