వైసీపీ నేతల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబును కడప రిమ్స్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పరామర్శించిన సంగతి తెలిసిందే. బాధితుడి కుటుంబ సభ్యులతో అప్యాయంగా మాట్లాడారు. జవహర్ బాబుకు అందిస్తున్న చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. తామంతా అండగా ఉంటామని.. త్వరగా కోలుకుని విధులకు హాజరుకావాలని జవహర్ బాబుకు ధైర్యం చెప్పారు.
అనంతరం మీడియాతో పవన్ మాట్లాడుతూ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ సమయంలో అక్కడికి భారీగా చేరుకున్న అభిమానులు ‘ఓజీ.. ఓజీ.. ఓజీ’ అంటూ పెద్దగా నినాదాలు చేశారు. దీంతో ఆయన ఆగ్రహానికి గురయ్యారు. ‘‘ఏంటయ్యా మీరు. ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదు. పక్కకు రండి’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఇక పవన్ సినిమాల విషయానికొస్తే సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’ సినిమా షూటింగ్‌లో కూడా త్వరలోనే పాల్గొంటారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 80శాతం పూర్తి అయింది. పవన్ పాత్రకు సంబంధించిన సన్నివేశాల షూటింగ్ మిగిలి ఉంది. త్వరలోనే ఈ సన్నివేశాలు కూడా తెరకెక్కించనున్నారు. అలాగే హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో కూడా పవర్ స్టార్ నటిస్తున్నారు. ఇవే కాకుండా సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనూ ఓ మూవీకి కమిట్ అయ్యారు. వచ్చే రెండు సంవత్సరాల్లో ఈ సినిమాలన్ని షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల కానున్నాయి.