హైడ్రా(Hydra) చర్యల వల్ల ఎఫ్‌టీఎల్(FTL), బఫర్ జోన్‌లు, అక్రమ నిర్మాణాలపై ప్రజల్లో అవగాహన పెరిగిందని ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్(Ranganath) తెలిపారు. ఇప్పుడు కొత్తగా ప్లాట్లు, ఫ్లాట్లు కొనేవారు జాగ్రత్తగా ఉంటున్నారని పేర్కొన్నారు. హైడ్రా వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ హైడ్రా ఇప్పటివరకు 8 చెరువులు, 12 పార్కులను కాపాడిందన్నారు. అలాగే 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామని చెప్పారు. హైడ్రాకు ఇప్పటివరకు 5,800 ఫిర్యాదులు అందాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో చెరువులకు సరిహద్దులు, బఫర్‌జోన్‌లు నిర్ణయిస్తున్నామన్నారు.
NRSEతో సమన్వయం చేసుకుని శాటిలైట్ చిత్రాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఏరియల్ డ్రోన్ చిత్రాలు కూడా తీసుకుంటామని.. ప్రభుత్వ భూములకు జియో ఫెన్సింగ్ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. చెరువులకు సంబంధించి 2000 నుంచి 2024 వరకు ఉన్న చిత్రాలు సేకరిస్తున్నామని వెల్లడించారు. నాలాలకు సంబంధించి కూడా కిర్లోస్కర్‌తో సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. మున్సిపాలిటీల్లో అనధికార నిర్మాణాలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు.
హైడ్రా అంటే.. కేవలం కూల్చేందుకే అన్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు కాపాడటమే హైడ్రా ప్రధాన కర్తవ్యమన్నారు భూముల రక్షణతో పాటు వరద నివారణ చర్యలు చేపడతాం. హైడ్రా తరఫున తర్వలోనే ఒక FM ఛానెల్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నామని.. దాని ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం తెలిపేందుకు వీలుంటుంది అని రంగనాథ్ తెలిపారు. కొందరు కావాలనే హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రంగనాథ్ మండిపడ్డారు.