Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్NE Election: ఎప్పటికప్పుడు కొత్త పాఠాలు

NE Election: ఎప్పటికప్పుడు కొత్త పాఠాలు

ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే బీజేపీ, దాని మిత్రపక్షాలకు ప్రభుత్వ వ్యతిరేకతను ఎలా ఎదుర్కోవాల్లో బాగా అర్థమైనట్టు కనిపిస్తోంది. నాగాలాండ్‌లో బీజేపీ విజయం నల్లేరు మీది బండి నడకలా సాగిపోయింది. ఎందుకంటే అక్కడ ప్రతిపక్షమంటూ ఏమీ లేదు. త్రిపురలో విజయం సాధించడానికి బీజేపీ గట్టి ప్రయత్నమే చేయాల్సి వచ్చింది. అక్కడ కాంగ్రెస్‌, వామపక్షాల మధ్య పొత్తు ఉంది. అవి పోటీ ఇచ్చే ప్రయత్నం చేశాయి. ముఖ్యంగా కొద్ది కాలం క్రితం కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ప్రభావం కూడా ఇక్కడ కనిపించింది. రాబోయే ఎన్నికలను పురస్కరించుకుని కాంగ్రెస్‌ ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం జరుగుతుందని, జాతీయ స్థాయిలో కూడా ఒక ప్రతిపక్ష కూటమి ఏర్పడే అవకాశం ఉందనే అభిప్రాయం కారణంగా అక్కడ కాస్తంత బీజేపీ వ్యతిరేక పవనాలు వీచాయి. త్రిపురలో సుమారు పాతికేళ్లు పాలన సాగించిన వామపక్షాల పట్ల ఉన్న వ్యతిరేకత కూడా కొంత కారణంగా కనిపించింది. ఆ కారణంగానే కాంగ్రెస్‌ ఓట్లలో చాలాభాగం వామపక్షాల అభ్యర్థులకు బదిలీ కాలేదు.
నిజానికి, అక్కడ 2018 వరకు సుదీర్ఘకాలం పాటు పాలన చేసిన వామపక్షాలు కొద్దో గొప్పో ఓట్లను రాబట్టుకోగలవని కాంగ్రెస్‌ భావించింది. వామపక్షాలు పోటీ చేసిన స్థానాలలో కాంగ్రెస్‌ శ్రేణులు ఆ పార్టీల పట్ల సుహృద్భావంతో ఉన్నట్టు ఎక్కడా కనిపించలేదు. ఇక అక్కడ గ్రేటర్‌ త్రిపుర రాష్ట్రాన్ని కోరుతున్న త్రిపుర మోతా పార్టీ కూడా ఆశించిన స్థాయిలో ఓటర్లను ఆకట్టుకోలేకపోయింది. ఏతావతా, బీజేపీ కొద్ది మెజారిటీతో అయినా సొంతగా విజయం సాధించగలిగింది. తన ప్రకటనలు, ప్రసంగాలతో ఇతర రాష్ట్రాల మీద ప్రభావం చూపించినట్టుగానే ఈశాన్య రాష్ట్రాలలో సైతం ఈ పార్టీ చూపించగలిగింది. ఇక మేఘాలయా విషయానికి వస్తే బీజేపీ తీవ్రాతితీవ్రంగా, కనీ వినీ ఎరుగని విధంగా ప్రచారం నిర్వహించింది. ఎలా అయినా ఈ రాష్ట్రాన్ని చేజిక్కించుకోవాలనే పట్టుదల ఆ పార్టీలో అడుగడుగునా కనిపించింది. కాన్రాడ్‌ సంగ్మా ప్రభుత్వం పరమ అవినీతి ప్రభుత్వమంటూ ప్రచారం చేసింది. హోం మంత్రి అమిత్‌ షా అక్కడ పార్టీ ప్రచారానికి వచ్చి, సంగ్మాను ఓడించడమే తమ పరమో ధర్మమని ప్రకటించడం కూడా జరిగింది. నిజానికి సంగ్మా పార్టీతో అంతకు ముందు వరకూ బీజేపీకి పొత్తు ఉంది. ఈ రెండు పార్టీలూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే, ఎన్నికలకు కొద్ది కాలం ముందు అయితే, సంగ్మా ప్రభుత్వం నుంచి బీజేపీ తప్పుకుంది. తీరా ఎన్నికల తర్వాత మళ్లీ సంగ్మా పార్టీతో పొత్తు పెట్టుకుని అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
విచిత్రమేమిటంటే, ఎద్దు మాంసాన్ని నిషేధించాలనేది బీజేపీ సిద్ధాంతాల్లో ఒకటి. అయితే, ఈసారి ఈశాన్య రాష్ట్రాలలో ఎక్కడా అది గోవధ నిషేధం తదితర అంశాల గురించి ప్రస్తావించలేదు. అత్యధిక సంఖ్యాక హిందూ మతానికి చెందిన పార్టీగా పేరున్న బీజేపీకి క్రైస్తవులు అధిక సంఖ్యలో ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో విజయం సాధించడం కష్టసాధ్యమైన విషయం. అయితే, బీజేపీలో అపర చాణక్యుడుగా పేరున్న అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ మూడు రాష్ట్రాలలో తనదైన శైలిలో చక్రం తిప్పారు. లోక్‌ సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో కూడా ఆయన చక్రం తిప్పబోతున్నారనే వార్తలు కూడా వినవస్తున్నాయి. మొత్తం మీద ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా హిమంత్‌ బిశ్వ శర్మ అవసరం బీజేపీ అధిష్ఠానానికి ఉంటూనే ఉంటుందనిపిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News