Saturday, October 5, 2024
Homeచిత్ర ప్రభSuryakantham: సావిత్రితో పోల్చదగిన ఏకైక సపోర్టింగ్ యాక్టర్

Suryakantham: సావిత్రితో పోల్చదగిన ఏకైక సపోర్టింగ్ యాక్టర్

ఆమె హీరోయిన్ కాదు కానీ హీరోయిన్ కు ధీటుగా పాపులర్. ఆమాటకొస్తే హీరోయిన్ కంటే చాలా చాలా ఎక్కువకూడా. మహానటి సావిత్రితో మాత్రమే పోల్చదగిన నటిగా మనమంతా గొప్పగా చెప్పుకునే ఆ నటి పేరే సూర్యకాంతం. తెలుగు వాళ్లెవరూ వాళ్ల అమ్మాయిలకు సూర్యకాంతం అనే పేరు పెట్టుకునే సాహసంసైతం చేయరంటే ఇక ఆమె స్క్రీన్ పైన ఏరేంజ్లో విలనీ చూపించారోకదా.

- Advertisement -

సూర్యకాంతం ఉందని చెప్పుకునేవారు..

ఫలానా సినిమాలో హీరో అతను, హీరోయిన్ ఈమె అనుకోవటమే కాదు. ఆ సినిమాలో సూర్యకాంతం ఉంది అనికూడా తప్పకుండా చెప్పుకునే రేంజ్ లో వెలిగిన యాక్ట్రెస్ సూర్యకాంతం. ఏమాత్రం నటించకుండా జీవించేసే యాక్టర్ సూర్యకాంతం. చాలా నాచురల్ గా ఆమె ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ ఉండేది.

గుండమ్మ కథంతా ఆమె చుట్టూనే..

గుండమ్మకథ సినిమా అంటే ఇష్టపడనివారుండరు కదా. గుండమ్మకథ అని ఆ సినిమాకు ఆపేరు ఎలావచ్చిందనుకున్నారు. అది గుండమ్మ అనే ఆమె కథ కాబట్టి. సినిమాలో ఆ గుండమ్మ మన సూర్యకాంతమే. అంటే లేడీ విలన్ క్యారెక్టర్ పేరే సినిమా పేరని అర్థమైంది. దటీజ్ సూర్యకాంతం.

గుమ్మడి వేసిన నింద

యాక్టర్ గుమ్మడి అయితే.. సూర్యకాంతంపై వేసిన నింద తెలుగునాట చాలా పాపులర్ అయింది. నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది. సూర్యకాంతం అనే చక్కనిపేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావ్ అని గుమ్మడి స్వయంగా సూర్యకాంతంతో అన్నట్టు ఆయనే చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో గుమ్మడి చెప్పిన ఈ విషయం అక్షరసత్యం. మీరెప్పుడైనా సూర్యకాంతం అనే పేరు పెట్టుకున్న అమ్మాయిని చూశారా. ఛాన్సే ఉండదు. ఎందుకంటే ఎవరైనా కాస్త గట్టిగా మాట్లాడినా, అరచినా పెద్దరికం ప్రదర్శించినా, తిట్టినా సూర్యకాంతంలా ఉన్నావ్ అంటారు. సో ఈ పేరు ఎవరూ తమ పిల్లలకు పెట్టుకోరు. అలా ఆమె తెలుగవారందరి జీవితంలో భాగమయ్యారు.

గయ్యాళి కాదు డ్యాన్స్, పాటలు నేర్చుకుంది

సినిమాల్లో గయ్యాళి పాత్రల్లో నటించాలంటే సూర్యకాంతం తరువాతే ఎవరైనా. నాచురల్ యాక్టింగ్ తో ఇరగదీసిన సూర్యకాంతం అక్టోబర్ 28, 1924లో పుట్టారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర వెంకట కృష్ణరాయపురంలో జన్మించారు సూర్యకాంతం. ఈమె తన తల్లిదండ్రులకు 14వ సంతానం. నిజానికి సూర్యకాంతం మంచి సింగర్ కూడా. ఎందుకంటే ఆరేళ్ల వయసునుంచే పాడటం, డ్యాన్స్ చేయటం నేర్చుకున్నారు. సూర్యకాంతంకు పాటలు పాడటం డ్యాన్స్ చేయటం బాగా వచ్చు. కానీ వాటిని స్క్రీన్ పైన చూపే ఛాన్స్ రాలేదంతే. సూర్యకాంతంకు హిందీ సినిమాలంటే చాలాచాలా ఇష్టం. ఆమె హిందీ సినిమా పోస్టర్లు చూసి సినిమాలంటే బాగా అట్రక్ట్ అయ్యారు. అంతే సినిమా స్టార్ అయిపోవాలని కలలుకన్నారు. హీరోయిన్ కావాలనుకున్నారు. ఈ టార్గెట్ తోనే ఆమె చెన్నైకి వచ్చేసారు.

హీరోయిన్ కావటమే కల

సూర్యకాంతం ఫిల్మీ కెరీర్ చంద్రలేఖ సినిమాతో స్టార్ట్ అయింది. అదికూడా డ్యాన్సర్ గా. ఇక ఆతరువాత సినిమాలో ఆమె మూగవేషం వేశారు. ఆతరువాత లీలాకుమారి సాయంతో ఓ సినిమాలో సపోర్టింగ్ యాక్టర్ గా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. కానీ ఈ చిన్నాచితకా క్యారెక్టర్స్ లో యాక్ట్ చేయటం కాదు తన డ్రీమ్. ఇదేం అంత సంతృప్తిగా లేదు పైగా జీతం కూడా చాలాచాలా తక్కువ అని ఆమె డిసైడ్ అయ్యారు. దీంతో ఆమె జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చేశారు ధైర్యంగా. ఎలాగైనా ముంబై వెళ్లాలని ఆమె గట్టిగా అనుకున్నారు. కానీ ఫైనాన్షియల్ గా అది తనకు సాధ్యంకాలేదు. అందుకే తప్పని పరిస్థితుల్లో మళ్లీ చెన్నైలోనే తన పోరాటం స్టార్ట్ చేశారు. ఈటైంలోనే సపోర్టింగ్ యాక్టర్ గా గృహప్రవేశం సినిమాలో ఛాన్స్ వచ్చింది. హీరోయిన్ కావాలనే తన డ్రీమ్ నెరవేరేలా సౌదామిని అనే సినిమాలో ఆమెకు హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. కానీ కార్ యాక్సిడెంట్ లో ముఖానికి గాయం అయింది. అంతే అలా హీరోయిన్ అయ్యే ఛాన్స్ జీవితకాలానికి మిస్ అయిపోయింది.

అత్తగా చెలరేగిపోయి..

ఆ తరువాత మళ్లీ ఇంకో ఇన్నింగ్స్ షురూ అయింది. ఈసారి సంసారం సినిమాలో గయ్యాళి అత్త పాత్ర. అంతే గయ్యాళి అత్తగా చెలరేగిపోయి నటించి అదరగొట్టేశారు సూర్యకాంతం. ఇక ఈసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఓ ప్రొడ్యూసర్ ద్వారా హీరోయిన్ గా బొంబాయిలో ఛాన్స్ వచ్చింది. కానీ తనకంటే ముందు ఇంకొకరు ఆ సినిమాలో హీరోయిన్ అని ఆమెకి తెలిసింది. ఒకరి బాధను నేను సంతోషంగా తీసుకోలేనని చెప్పి హీరోయిన్ ఛాన్స్ వద్దనుకున్నారు. సూర్యకాంతంలోని అసలు యాంగిల్ ఇదే. రీల్ లైఫ్ లో ఆమెను మించిన గయ్యాళే లేరు. కానీ రియల్ లైఫ్ లో ఆమె చాలా సెన్సిటివ్.

స్పాట్

ఆమె లేకపోతే సినిమా తీసేవారు కారు

నాగిరెడ్డి-చక్రపాణి అయితే సూర్యకాంతం లేకుండాసినిమాలే తీసేవారు కాదు. అంతేకాదు సూర్యకాంతంతో కొందరికి హిట్ పెయిర్ అనే పేరుపడింది కూడా. రేలంగి-సూర్యకాంతం, రమణారెడ్డి-సూర్యకాంతం, ఎస్ వీ రంగారావు-సూర్యకాంతం ఇలా వీళ్లను తెలుగువాళ్లు బాగా గుర్తుచేసుకుంటారు. వీళ్ల కాంబోల్లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్లే.

విలనీతో నవ్వులు

సూర్యకాంతం ఓ సీరియస్ యాక్టర్. ఆమె విలనీతోకూడా నవ్వులు పూయించేవారు. అంతేకాదు రక్తకన్నీరు తెప్పించేవారు. ఎడంచెయ్యితో ఆమె చూపే బాడీ లాంగ్వేజ్ భలే ఉంటుంది. అమ్మో అయ్యో అంటూ ఏడుపులు, కబుర్లు ఏమని చెప్పగలం ఆమె గోల. స్క్రీన్ మీద ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లా వెలిగిపోయేవారు. కానీ పాపం నిజజీవితంలో ఆమె చాలా మంచివారు. స్వయంగా ఆమెకు పిల్లలు లేరు. సెట్లో చాలా చక్కగా, పద్ధతిగా ఉండేవారు. సూర్యకాంతం వంటలు కమ్మగా చేసేవారు. సినిమా సెట్లోకి స్వయంగా వంట చేసి క్యారియర్లు తెచ్చి చాలామందికి ఆమె భోజనం పెట్టేవారు. సావిత్రికి కూడా ఆమె రెగ్యులర్ గా పులిహోర తెచ్చిపెట్టేవారు. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన సూర్యకాంతం భలే టేస్టీగా వండుతారు. అందుకే ఆమె తెచ్చే టిఫిన్ బాక్స్ కు చాలా డిమాండ్ ఉండేది. ఆమె పులిహోర వండితే దానికి తిరుగుండేది కాదని ఇండస్ట్రీలో టాక్. పండగ రోజుల్లో షూటింగ్ ఉంటే పెద్ద బాక్స్ తీసుకొచ్చి ఫుడ్ పంచి ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు.

ఆటోగ్రాఫ్ అడగాలన్న వణికిపోయేవారు

నిజజీవితంలో సూర్యకాంతం చాలా మంచివారు. కానీ ఈ విషయం తెలీక ఆమె దగ్గరికి వెళ్లేందుకు కూడా చాలామంది బెదిరి చచ్చేవారు. ముఖ్యంగా ఆమెతో ఆటోగ్రాఫ్ తీసుకోవాలంటే అడగడానికికూడా భయపడేవారు. అంతెందుకు సూర్యకాంతం ఇంట్లో పనిచేరేందుకు పనివాళ్లు దొరికేవారు కాదట. ఆమె ఇంట్లోనా మేం పనికి చేరమని పనివాళ్లు జారుకునేవాళ్లని చెన్నైలో చాలా మందికి తెలుసు. క్యారెక్టర్ ప్రకారం యాక్ట్ చేయక తప్పదుకదా. ఓ సినిమాలో ఇలాగే నాగయ్యను నానా మాటలు తిట్టే సీన్ వచ్చింది. ఆమె చకచకా అతన్ని తిట్టేసి షాట్ ఎండింగ్ లో నన్ను క్షమించండి అని కాళ్లమీద పడి ఒకటే ఏడ్చేశారట సూర్యకాంతం. అప్పుడు చిత్తూరు నాగయ్య.. అమ్మా.. క్యారెక్టర్ తిట్టిందమ్మా.. నువ్వెందుకు బాధపడతావని ఓదార్చారట. మీరు ఇలాంటివి ఎప్పుడైనా విన్నారా, ఛాన్సే ఉండదు. సూర్యకాంతం మనసు అంత సున్నితం. అంత చక్కని ప్రవర్తన ఉన్న యాక్టర్ ఆమె.

ఎప్పటికీ నటించాలని కోరిక

ఇక రెమ్యునరేషన్ విషయానికి వస్తే ఆమె చాలా కచ్ఛితంగా ఉండేవారు. ప్రొడ్యూసర్ ను గట్టిగా అడిగేవారు. అంతేకాదు తన కారు రిపేర్ చేయించాల్సివస్తే మెకానిక్ తన కళ్లముందే రిపేర్ చేయక తప్పదని తెగేసి చెప్పేవారు. ఆమెకు ఎప్పటికీ నటిస్తూనే ఉండాలనే కోరిక ఉండేది. అందుకే ఆరోగ్యం బాలేకపోయినా యాక్ట్ చేస్తానని ఆమె చెప్పేవారు. 1993లో వన్ బై టు లాంటి కొత్త సినిమాల్లోనూ ఆమె యాక్ట్ చేశారు. ఆతరువాత వచ్చిన ఎస్పీ పరుశరాం సినిమా ఆమెకు లాస్ట్ సినిమా. ఆతరువాత ఆమె చెన్నైలోని సొంత ఇంట్లోనే ఎక్కువకాలం గడిపారు. కానీ ఆమెకు ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా మన సినిమావాళ్లెవరూ ఆమెను చూసొచ్చింది లేదు. ఆఖరుకి ఆమె మరణించాక కూడా కడసారి చూసేందుకు ఏ దర్శక నిర్మాతలు, నటీనటులు వెళ్లలేదు. అంతటి మహానటి మరణిస్తేకూడా మన ఫిలిం ఇండస్ట్రీ ఏం పట్టించుకోలేదంటే ఇంకేమనాలి.

సూర్యకాంతంకు ప్రత్యామ్నాయం లేరు

ఈ ఇయర్ గుండమ్మకథ రిలీజై 60 ఏళ్లైంది. ఒకసారి ఓ పాపులర్ డైరెక్టర్ గుండమ్మకథను జూనియర్ ఎన్టీఆర్-నాగచైతన్యతో రీమేక్ చేయాలని అనుకున్నారట. వెంటనే ఆయన నాగేశ్వర రావు దగ్గరికి వెళ్తే మరి సూర్యకాంతం, ఎస్వీ రంగారావు ప్లే చేసిన రోల్ కోసం ఎవరిని తెస్తాం, వాళ్లకు ఆల్టర్నేటివ్ అసలు లేరని చెప్పారట. దీంతో గుండమ్మకథ రీమేక్ ప్రాజెక్ట్ అలా పక్కనపెట్టేయాల్సి వచ్చింది. అంటే జస్ట్ హీరో-హీరోయిన్ మాత్రమే కాదు సపోర్టింగ్ రోల్స్ ప్లే చేసే సూర్యకాంతం కు ఆల్టర్నేటివ్ యాక్టర్ లేదని తెలుగు ఇండస్ట్రీ పూర్తిగా గుర్తించినట్టే.

సహజ నటకళా శిరోమణి, హాస్య నట శిరోమణి, బహుముఖ నటనా ప్రవీణ, రంగస్థల శిరోమణి, గయ్యాళి అత్త వంటి అవార్డులు సూర్యకాంతం సొంతంచేసుకున్నారు. భర్త పెద్దిబొట్ల చలపతిరావు హైకోర్టు జడ్జిగా పనిచేసేవారు. అంత పెద్ద ఇంటి ఇల్లాలైనా సొంతంగా మంచి స్టార్ డం ఉన్న నటి అయినా ఆమె ఏనాడూ పొగరు, యాటిట్యూడ్ చూపకపోవటం హైలైట్.

ట్రెండ్ సెట్టర్

సూర్యకాంతం లాంటి సపోర్టింగ్ యాక్టర్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరూ లేరు. గయ్యాళి రోల్స్ ప్లే చేయాలంటే అందరూ ఆమెను కాపీ చేయాల్సిందే, కాపీ చేస్తున్నారు కూడా. ఇప్పటికీ ఆమె ఓ ట్రెండ్ సెట్టర్ గానే ఉన్నారు. సూర్యకాంతం సినిమాలంటే, సూర్యకాంతం డైలాగులంటే మన తెలుగు వారికి ఓ ఆవకాయ పచ్చడంత టేస్టీగా ఉంటాయి. అందుకే సూర్యకాంతం కల్ట్ మూవీస్ ను నేటితరమూ ఇంట్రెస్టింగ్ గా చూస్తోంది. మహానటి సావిత్రితో పోల్చే స్థాయికి ఎదిగిన సపోర్టింగ్ యాక్టర్ సూర్యకాంతం తప్ప మరెవ్వరూ లేకపోవటమంటేనే అర్థమవుతుంది సూర్యకాంతం ఎంత గొప్ప యాక్టరో.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News