బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో(Border – Gavaskar Trophy 2024) ఆస్ట్రేలియా జట్టు 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పొందింది. 340 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ కేవలం 155 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్ 184 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (84), రిషభ్ పంత్ (30) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మరోసారి ఘోరంగా విఫలమయ్యారు.
తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో అదరగొట్టిన నితీష్ కుమార్ రెడ్డి రెండో ఇన్నింగ్స్‌లో 1 పరుగు మాత్రమే చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్, బోలాండ్ చెరో 3 వికెట్టు, లయన్ 2, స్టార్క్, హెడ్ తలో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 474 పరుగులు చేయగా.. భారత్ 369 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 234 పరుగులకు ఆలౌటైంది. కాగా ఐదో టెస్టు జనవరి 3న ప్రారంభం కానుంది.