సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ (Allu Arjun) దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో(Namaplly Court) విచారణ ముగిసింది. విచారణ సందర్భంగా అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు బెయిల్ మంజూరు చేయాలంటూ వాదనలు వినిపించారు. ఇక బెయిల్ ఇవ్వొద్దంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును జనవరి 3కి వాయిదా వేసింది.
సంధ్య థియేటర్ ఘటనకు, అల్లు అర్జున్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన తరపు న్యాయవాదులు తెలిపారు. రేవతి మృతికి ఆయన కారణమంటూ పోలీసులు నమోదు చేసిన కేసు చెల్లదని.. అందుకే రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అయితే అల్లు అర్జున్‌కు బెయిల్ ఇస్తే విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
కాగా ఈ కేసులో నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే తెలంగాణ హైకోర్టు(TG HighCourt) నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో బన్నీ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఈనెల 27న రిమాండ్ ముగియడంతో అదే రోజు బన్నీ వర్చువల్‌గా కోర్టుకు హాజరయ్యారు. అప్పుడే అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.