అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమ్‌ఆద్మీపార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆలయాలు, గురుద్వారాల్లో పని చేసే పూజారులు, గ్రంథీల కోసం కొత్త పథకాన్ని ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే వారికి నెలకు రూ.18 వేలు గౌరవ వేతనంగా అందజేస్తామని పేర్కొన్నారు. వారు మన ఆచారాలను భవిష్యత్ తరాలకు అందజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. దురదృష్టవశాత్తూ వారి ఆర్థిక స్థితిని ఎవరూ పట్టించుకోవడం లేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ పథకం రిజిస్ట్రేషన్ మంగళవారం నుంచి ప్రారంభం అవుతుందని చెప్పారు. హనుమాన్ ఆలయంలో తానే ఈ ప్రక్రియను ప్రారంభిస్తానని చెప్పారు. ఈసందర్భంగా ఎలాంటి అవాంతరాలు కలిగించొద్దని బీజేపీని ఆయన కోరారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయాల పరంపరను కొనసాగించాలని పట్టుదలతో ఉన్న కేజ్రీవాల్ వరుస సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే వృద్ధుల కోసం సంజీవని స్కీమ్, మహిళా సమ్మాన్ యోజన (పద్దెనిమిదేళ్లు దాటిన ప్రతి మహిళకు నెలనెలా రూ.2,100 ఆర్థిక సాయం), ఇప్పుడు అర్చకులకు గౌరవ వేతనం వంటి హామీలు ఇచ్చి ఓటర్లను తెగ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.