తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేసు కేసు విచారణం వేగవంతం చేశారు. దీంతో మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ పిటిషన్ విచారణకు న్యాయస్థానం అనుమతించింది. ఏసీబీ విచారణకు తన న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన న్యాయస్థాన్ని ఆశ్రయించారు.
ఈ నెల 6న కేటీఆర్‌ను ఏసీబీ విచారణ చేయాల్సింది. కానీ తన న్యాయవాదిని అనుమతించనందున హాజరుకాలేనంటూ ఆయన ఏసీబీ కార్యాలయానికి వచ్చి మరీ తిరిగి వెళ్లిపోయారు. దాంతో ఏసీబీ అధికారులు అదే రోజు కేటీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ ఏ1గా ఉన్నారు. ఇక ఈ కేసులో ఏ2గా ఉన్న అరవింద్‌కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. హెచ్ఎండీఏ నుంచి ఎఫ్‌ఈవోకు హెచ్ఎండీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బీఎల్‌ఎన్ రెడ్డి ద్వారా అరవింద్ కుమార్ నిధులు బదిలీ చేశారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు ఇదే కేసులో బీఎల్‌ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. 45కోట్ల 71 లక్షలు విదేశీ సంస్థకు బదిలీ చేసిన వ్యవహారంలో మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ దర్యాప్తు చేస్తోంది.
మరోవైపు విచారణకు న్యాయవాదిని అనుమతించడం కుదరదని KTRకు ఇచ్చిన 2వ నోటీసులో.. ACB పేర్కొన్నట్లు తెలుస్తోంది. న్యాయవాది సమక్షంలో విచారణ కోరడం నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. లాయర్ ను అనుమతించలేదనే సాకుతో విచారణ తప్పించుకుంటున్నారని.. విచారణ తర్వాత సమాధానం ఆధారంగా డాక్యుమెంట్లు తీసుకురావాలనేది చెపుతామని దానికి సమయం కూడా ఇస్తామని ACB తెలిపింది. అయితే విచారణకు సహకరించకపోతే చర్యలు తప్పవని పేర్కొంది.
ఇదిలా ఉంటే కేటీఆర్ పై ఏసీబీకి మరో ఫిర్యాదు అందింది. రూ.7,380 కోట్ల ORR టోల్ టెండర్లలో అవినీతి జరిగిందని.. వనపర్తి జిల్లా వాసి యుగంధర్ ఫిర్యాదు చేశాడు. క్విడ్ ప్రోకో జరిగిందని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే వ్యవహారంపై KTRతో పాటు కేసీఆర్ పైనా ఈడీకి ఫిర్యాదు చేశాడు.