Friday, January 10, 2025
HomeAP జిల్లా వార్తలుతిరుపతిBhumana on Tirupathi stampede: ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసింది: భూమన

Bhumana on Tirupathi stampede: ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసింది: భూమన

చీకటి రోజు..

చిత్తశుద్ధిలేని వ్యక్తులకు, వివాదాస్పద వ్యక్తులకు టీటీడీ పగ్గాలు ఇచ్చారని, వెరసి ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసిందని వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి భగ్గుమన్నారు. టీటీడీని రాజకీయ కేంద్రంగా మార్చారని ఆరోపించిన భూమన, భక్తుల ప్రయోజనాలను గాలికి వదిలేశారని తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. అధికారంలోకి వచ్చింది మొదలు శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీశారని, ప్రతిపక్షంపై దుష్ప్రచారానికి తిరుమలను, టీటీడీని వాడుకున్నారని మండిపడ్డారు. గడచిన ఐదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదన్న భూమన, మరి ఇప్పుడు ఎందుకు జరిగిందని నిలదీస్తున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులు తొక్కసలాటకు గురికావడం, అందులో మరణించడం సాధారణమైన విషయం కానేకాదన్న ఆయన, టీటీడీ చరిత్రలో ఇదొక చీకటిరోజని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఈపాపం మూటగట్టుకుందని నిప్పులు చెరిగిన భూమన, ప్రచారాలు, ఆర్భాటాలు తప్ప ఆయనకు ఏమీ పట్టవని విమర్శలు కురిపించారు.

- Advertisement -

పుష్కరాల సీన్ రిపీట్
గోదావరిలో పుష్కరాల తొక్కిసలాట ఘటన ఇప్పటికీ మనకు చేదు జ్ఞాపకమేనంటూ గుర్తు చేసిన ఆయన, హిందూ ధర్మంమీద భక్తి, శ్రద్ధ ఈ ప్రభుత్వానికి లేకనే ఇలాంటి ఘటనలని ఆరోపించారు. భక్తులకు అందించే సేవలు అత్యంత పవిత్రమైనవి, వాటిని తేలిగ్గా చూడ్డంవల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు. పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు దర్శనానికి లక్షలాదిమంది వస్తారని అందరికీ తెలుసని, తెలిసీ ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని ప్రశ్నించారు.

సేవ కాదు రాజకీయాలు కావాలి
తిరుపతిలో పోలీసు అధికారుల దృష్టి అంతా రాజకీయంగా కక్ష తీర్చుకునే కేసులపైనే ఉందన్న భూమన, వైయస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడంపైనే వారి దృష్టి ఉందన్నారు. తిరుపతి ఎస్పీ టీడీపీ కార్యకర్తగా మారి భక్తుల రక్షణ బాధ్యతలను పట్టించుకోలేదని, అధికారుల మధ్య, పోలీసుల మధ్య సమన్వయం లేదని, శ్రీవారి భక్తుల సేవకన్నా, టీటీడీ ఛైర్మన్‌కు రాజకీయ వ్యాఖ్యానాలే ఎక్కువన్నారు. ఆయన పనంతా రాజకీయ దుష్ప్రచారం చేయడమేనన్న ఆయన, టీటీడీ ఛైర్మన్‌ తన టీవీ కార్యాలయాలను తిరుమల టిక్కెట్ల విక్రయ కేంద్రాలుగా మార్చారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయన్నారు. తొక్కిసలాట ఘటనపై వెంటనే విచారణ జరగాలని, టీటీడీ ఛైర్మన్‌ సహా, స్థానిక ఎస్పీ, ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అసమర్థ పరిపాలన అందిస్తున్న చంద్రబాబు శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలని భూమన గట్టిగా తమ గొంతు వినిపించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News