Friday, January 10, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్Kites: పతంగులు @ధూల్పేట్

Kites: పతంగులు @ధూల్పేట్

ధూల్పేట్ కళాకారుల కైట్స్

సంక్రాంతి పండుగ అనగానే ముందుకుగా మనకు గుర్తుకు వచ్చేది పతంగులు ఎగరేయడం. సంక్రాంతి అంటే గాలి పటాలు, గాలి పటాలు అంటే సంక్రాంతి అనే విధంగా ఉంటుంది. పతంగులు ఎగిరేసేందుకు చాలా మంది సంక్రాంతి పండుగ ఎపుడొస్తుందా? అని ఎదురు చూస్తుంటారు. ఇతర సమయాల్లో పతంగులు ఎగిరేసినా సంక్రాంతి రోజు పతంగులు ఎగిరేస్తే ఆ కిక్కు వేరేలా ఉంటుంది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే పిల్లలు,పెద్దలు, యువకులు పతంగులు ఎగిరించేందుకు ఉత్సాహంగా ఉంటారు. కొత్త కొత్త రకాల పతంగులు కొని, రకరకాల రంగుల మాంజాలతో వాటిని ఎగిరేస్తూ పక్కవాళ్ల పతుంగులను తన మాంజా దారంతో లాగి తెంపి ఎంజాయ్చేస్తుంటారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే పతంగుల తయారీకి అడ్డా అయిన ఓల్డ్ సిటీలోని ధూల్పేట్, మంగళ్హాట్ ప్రాంతాలకు కొత్త శోభ వస్తుంది. రంగుల పతంగులు, రకరకాల మాంజాలు. వందలసంఖ్యలో పతంగులతో మంగళ్హాట్ , ధూల్పేట్ లో రోడ్డుకు ఇరువైపులా వేసిన షాపులతో ఈ ప్రాంతం కళకళలాడుతుంది. నరగంలోని చాలా ప్రాంతాల నుంచి జనం వచ్చి ఇక్కడ పతంగులు కొనుక్కుని పోయి తమ తమ ఏరియాల్లో వాటిని ఎగురేస్తుంటారు. అయితే ఎలాంటి డిజైన పతంగి అయినా, ఎంత పెద్దదైనా చాలాచిన్నదైనా ఇలా రకరకాల పతంగులు షాపుల్లో చాలా తక్కువ ధరలకు లభిస్తుంటాయి.

- Advertisement -

పతంగుల ఆట ప్రాచీన సంప్రదాయం
హైదరాబాద్ నగరం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ పతంగులు ఎగురవేసే సంస్కృతి ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెపుతున్నాయి. కులీ కుతుబ్షాహీల కాలం నుంచి ప్రతి యేటా హేమంత రుతువులో నగరంలో పతంగుల పండుగ కొనసాగుతుండేది. ఇబ్రహిమ్ కులీ కుతుబ్షా హయాంలో గోల్కొండ కోటలో పతంగుల పండుగ అధికారికంగా జరిగేదని చెపుతున్నారు. ఆ రోజుల్లో కాగితాలతో చేసిన పతంగులు, మూలికలతో చేసిన మాంజాతో పోటీలు కూడా నిర్వహించే వారని చరిత్ర కారులుతమ పుస్తకాల్లో రాసిన ఆధారాలు ఉన్నాయి. కుతుబ్షాహీల అనంతరం ఆసఫ్ జాహీల పాలనా కాలంలో హైదరాబాద్ పాతబస్తీలోని గ్రౌండ్ లలో పతంగుల పండుగ ఘనంగా నిర్వహించే వారు. ఇక ఆరవ నిజామ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ పాలనా కాలంలో పతంగుల పండుగకు మరింత గుర్తింపు వచ్చింది. గ్రౌండ్ లలో పతంగుల పోటీలు నిర్వహించి ఎక్కువ పతంగులను పడగొట్టిన వారికి బహుమతులు కూడా ఇచ్చే వారు. పాతబస్తీలో 1985 వరకు పతంగుల పోటీలు ప్రతి యేటా నిర్వహించే వారని, అయితే రానురాను పతుంగు పోటీలు కొన్నిప్రాంతాలకే పరిమితం కాగా ప్రస్తుతం చాలా మంది ఏదో ఎంజాయ్ మెంట్ కోసం పండుగ రోజున పతంగులు ఎగురవేస్తున్నారు.

నాలుగు నెలల ముందు నుంచే తయారీ
నిజాం కాలం నుంచి కొనసాగుతున్న ఈ పతంగుల పండుగ సంక్రాంతికి నాలుగు నెలల ముందు నుంచే వాటిని తయారీ చేసేవారు. యావత్తు తెలంగాణ జిల్లాలకు ఇక్కడ నుంచే పతంగులు సరఫరా అయ్యేవి. సంక్రాంతి సీజన్లో అప్పట్లో లక్షల్లో పతంగులు తయారు చేసే వారు. ఇప్పుడు కూడా తయారు చేస్తున్నా మార్కెట్లో ఎక్కువగా ప్లాస్టిక్ పతంగులే వినియోగిస్తున్నందున ప్రస్తుతం దూల్పేట్లో షాపుల్లో అత్యధికశాతం ప్లాస్టిక్ గాలి పటాలే దర్శనమిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ధూల్పేట్లో 80 శాతం కాగితం పతంగులు తయారు చేస్తుండగా, 20శాతం అహ్మదాబాద్, ఢిల్లీ, మురాదాబాద్, రాజస్తాన్, కల్కతాల నుంచి తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు.


గతంలో చాలా రకాలు, ఇప్పుడు అంతా ప్లాస్టికే
గతంలో చాలా రకాల పతంగులు లభించేవి. వాటిలో గుడ్డి, డోరీ, గోల్కాఫ్, దూలా దుల్హన్, లంగోర్, చాంద్ సితారా, చాంద్ తారా ఇలాంటి పేర్లతో పతంగులు తయారు చేసేవారు. ఇప్పుడు మార్కెట్లో చాలా వరకు డోరేమాన్, ఫిష్హట్, ప్లేన్, లైనింగ్, రకరాల జంతువులు, పులులు, సింహాలు, గుర్రాలతో తయారు చేసిన ప్లాస్టిక్ పతంగులు అందుబాటులో ఉన్నాయి. ప్లాస్టిక్ పంతుగులతో పాటు కొన్ని షాపుల్లో బట్టతో తయారు చేసిన పతంగులు కూడా విక్రయిస్తున్నారు.


మార్కెట్లో రకరకాల మాంజాలు
గతంలో సహజసిద్దంగా మాంజా తయారు చేసేవారు . గాజు సీసాల పొడి, అన్నం, రెండు రకాల మసాలాలు, రంగులు కలిపి వాటిని ఒక ముద్దగా తయారు చేసి మాంజా దారాన్ని తయారు చేసి విక్రయించే వారు. అయితే మార్కెట్లోకి చైనా మాంజా రావడంతో సహజ సిద్దంగా తయారు చేసే పతంగుల మాంజా దారాలు ఆగిపోయాయి. చైనా మాంజాను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడంతో ప్రస్తుతం తిరిగి సహజ సిద్ధంగా తయారు చేసే మాంజా దారానికి డిమాండ్ పెరుగుతోందని తయారీదారులు చెపుతున్నారు.

పతంగులు–మాంజా ధరలు
ధూల్పేట్, మంగళ్హాట్లలో విక్రయిస్తున్న పతంగులు ధరలు అన్ని రకాల వారికి అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఒక్కో పతంగు ధర రూ.2 ల నుంచి మొదలై రూ.250 వరకు ఉన్నాయి. కొన్ని షాపుల్లో రూ.5వేల ధర కలిగిన పతంగులు కూడా ఉన్నాయి. అయితే వాటికి ఎక్కువగా డిమాండ్ లేదంటున్నారు. మాంజాల ధరల విషయానికొస్తే ఇక్కడ సహజ సిద్దంగా దారంతో తయారు చేసిన మాంజాలు మాత్రమే విక్రయిస్తున్నారు. ఒక్కో మాంజా ఖరీదు వాటి సైజును బట్టి రూ.150 నుంచి రూ.2 వేల వరకు ఉన్నాయి.

పదేళ్లుగా తగ్గిన సందడి
1985 వరకు ఎంతో ఆసక్తిగా , ఉత్సాహంగా పతంగుల పోటీలు నిర్వహించగా, రానురాను పోటీలు పూర్తిగా ఆగిపోయి కేవలం పండుగ సమయంలో మాత్రమే పతంగులు ఎగురవేసే స్థాయికి చేరింది. ఆధునిక పోకడలతో సెల్ ఫోన్లకే పరిమితమైన పిలడ్లలు పతంగులను ఎగురవేయడంలో ఆసక్తి చూపడం లేదని, దీంతో పిల్లల్లో పతంగులపై ఆసక్తి తగ్గిందంటున్నారు. ముఖ్యంగా సిటీలో గ్రౌండ్లు లేకపోవడం,పెద్ద పెద్దభవనాలు అడ్డంకిగా మారాయి. దీనికి తోడు పిల్లలు, కంప్యూటర్ గేమ్స్, ఇన్ స్టా గ్రామ్, యూట్యూబ్, ఇంటర్నెట్కు అలవాటు పడి ఈ ఆటపై ఆసక్తిచూపడం లేదంటున్నారు. ఏదో పండుగ రోజు కాసేపు పతంగులు ఎగురవేసి మళ్లీ స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్నారని. దీంతో తరతరాలుగా కొనసాగిన ఈ ఆటకు ఆదరణ తగ్గుతుందంటున్నారు.

అంతా కాటన్ మాంజా
ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతుండటంతో చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించింది. దీంతో ఇక్కడ వ్యాపారులు సైతం చైనా మాంజా విక్రయాలను పూర్తిగా నిషేధించి అంతా కాటన్ మాంజానే వినియోగిస్తున్నారు. మాంజాను లోకల్ గా తయారు చేస్తున్నప్పటికీ కొన్ని రకాల మాంజాలను ఢిల్లీ, రాజస్తాన్, అహ్మదాబాద్ నుంచి తెప్పించి విక్రయిస్తున్నారు. అలాగే మాంజాలతో పాటు దానిని చుట్టేందుకు అవసరమైన కర్ర చరకాలను మన రాష్ట్రంతో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ రాష్టాల నుంచి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నారు.

50 ఏళ్లుగా ఇదే వృత్తి ఆధారం
“గతంలో మా పూర్వికులు ఈ వృత్తిని చేశారు. అయితే మధ్యలో కొంత కాలం ఆగిపోయినా, గత 50 ఏళ్లుగా పతంగుల విక్రయాలపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. ప్రస్తుతం పతంగుల వ్యాపారానికి కొంత ఆదరణ తగ్గింది. ఎవరూ పేపర్ పతంగులు కొనేందుకు ఇష్టపడటం లేదు. దీంతో లోకల్గా తయారు చేయడం మానేసి రాజస్తాన్, అహ్మదాబాద్ నుంచి ప్లాస్టిక్ పతంగులు తెచ్చి అమ్ముతున్నాం. ఈ వ్యాపారానికి ఆశించిన మేరకు లాభాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం మాకు కొంత ఆర్థిక సహాయాన్ని అందించాలి”.
–జైపాల్ సింగ్, పతంగుల దుకాణం, ధూల్పేట్

పతంగులు ఆడేందుకు ఇష్టపడుతలేరు
“మా చిన్నప్పుడు పతంగులు ఎగిరేసేందుకు పోటీ పడేవాళ్లం. మా షాపు నుంచి పతంగులు తీసుకుపోయి పొద్దున్నుంచి చీకటి పడే దాకా ఆడేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పతంగులు ఆడేందుకు యువకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. సెల్ఫోన్లతో బిజీగా మారిన యువకులు పతంగులు అంటే ఎలా ఎగరేస్తారని అడుతున్నారు. పతంగులు ఎగిరేసే వాళ్లు తగ్గుతుండటంతో ఈ బిజినెస్కు కూడా ఆదరణ తగ్గింది. ఒకప్పుడు నెల రోజుల పాటు షాపుల్లో పతంగులు అమ్మేవాళ్లం ఇప్పుడు అది నాలుగు రోజులకు పరిమితమైంది”.
–మహేష్ సింగ్, పతంగుల వ్యాపారి, మంగళ్హాట్.

గతంలో యేడాది మొత్తం పతంగులు అమ్మేది
“గతంలో పతంగులు యేడాది మొత్తం ఎగిరేసేవారు. దీంతో సంక్రాంతి సీజన్లో నే కాకుండా వేసవి సెలవుల్లో, ఇతర సీజన్లలో పతంగుల విక్రయాలు జోరుగా సాగేది. ఇప్పుడు కేవలం సంక్రాంతి టైమ్లో మాత్రమే వాటిని కొంటున్నారు. అదీకూడా కేవలం నాలుగు రోజులు మాత్రమే గిరాకీ ఉంటుంది. ఈనెల 10నుంచి పతంగుల విక్రయాలు పెరుగుతాయి. అయితే దూల్పేట్లో గుడుంబా విక్రయాలు లేకపోవడంతో చాలా మంది పతంగుల దుకాణాలు పెట్టారు. దీంతో పోటీ పెరిగింది. గిరాకీ చాలా తగ్గిపోయింది”.
–రాజాసింగ్, పతంగుల వ్యాపారి, రహీంపురా

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News