వారానికి 90 గంటల పాటు పని చేయాలని ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు సెలబ్రిటీలు కూడా ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన దీపికా పదుకొణె (Deepika Padukone) తీవ్ర అసహనం వ్యక్తంచేస్తూ ఓ పోస్ట్ పెట్టారు. ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆశ్చర్యానికి గురయ్యానని పేర్కొన్నారు. తన పోస్ట్‌కు #MentalHealthMatters అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.
కాగా ‘ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు. ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు. ఇంట్లో తక్కువ సమయం, ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని భార్యలకు చెప్పాలి’ అంటూ ఎల్ అండ్ టీ ఛైర్మన్ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా ఆయన వ్యాఖ్యలపై కంపెనీ ఇచ్చిన వివరణపై మరింత విమర్శలు వస్తున్నాయి. ఎనిమిది దశాబ్దాలుగా జాతి నిర్మాణమే ఎల్ అండ్ టీకి ప్రధాన లక్ష్యంగా ఉందని తెలిపింది. అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే క్రమంలో అసాధారణ లక్ష్యాలను చేరాలంటే అసాధారణ కృషి అవసరమని పేర్కొంది. చైర్మన్ వ్యాఖ్యలు ఈ లక్ష్యాలను ప్రతిబింబిస్తాయని వెల్లడించింది.