Friday, January 10, 2025
Homeచిత్ర ప్రభHarish Rao: తెలంగాణలో 'గేమ్ ఛేంజర్' టికెట్లు పెంపుపై హరీశ్ రావు ఆగ్రహం

Harish Rao: తెలంగాణలో ‘గేమ్ ఛేంజర్’ టికెట్లు పెంపుపై హరీశ్ రావు ఆగ్రహం

‘గేమ్ ఛేంజర్’ సినిమా టికెట్ల పెంపునకు అనుమతి ఇవ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా మాట మార్చారని మండిపడ్డారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

- Advertisement -

“ఒక మహిళ మృతి చెందారు, ఇక మీదట సినిమాలకు స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెండు వారాలు కూడా తిరగకముందే ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా మాట మార్చారు. టికెట్ రేట్లు పెంచేది లేదంటూ అదే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు సైతం స్వల్ప వ్యవధిలోనే నీటి మూటలు అయ్యాయి.

అసెంబ్లీలో ప్రకటించిన దానికే విలువ లేకపోతే ఎట్లా ? అసెంబ్లీని కూడా తప్పుదోవ పట్టిస్తూ టికెట్ రేట్లు, అదనపు షోస్‌కి అనుమతి ఇవ్వడం సభను అవమానించడమే. అసెంబ్లీని తప్పుదోవ పట్టించినందుకు ముఖ్యమంత్రిపై, మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన కింద ప్రివిలేజ్ మోషన్ పెడతాం. మాట తప్పం , మడమ తిప్పం అంటూ బీరాలు పలికి ఇప్పుడు టికెట్ రేట్ల పెంపునకు ఎలా అనుమతి ఇచ్చారు? ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు?

గతంలో మీరు బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వడం వల్లే ఒక మహిళ మృతి చెందారు, మరో పసివాడు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ పాపం మీ ప్రభుత్వానిదే కదా రేవంత్ రెడ్డి. ఆ దురదృష్ట ఘటనను మరిచిపోకముందే ఎందుకు ఈ యూ టర్న్? దీని వెనుక ఉన్న మర్మం ఏమిటి?” అని హరీశ్ రావు ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News