రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఈవెంట్‌కు హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో కాకినాడ జిల్లా గైగోలుపాడు గ్రామానికి చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్(22) అనే ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం విధితమే. తాజాగా యువకుల మరణానికి కారణమైన ఘటనా స్థలాన్ని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పరిశీలించారు.
పిఠాపురం పర్యటనకు వెళ్తున్న ఆయన రంగంపేట ఏడీబీ రోడ్డులోని ప్రమాద స్థలిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోడ్డు మరమ్మతు పనుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా పవన్ వెంట కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి, ఇతర ఉన్నతాధికారులు, జనసేన నాయకులు ఉన్నారు.