తెలంగాణలో ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమా టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోల అనుమతిపై హైకోర్టు(TG High Court)లో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. బెనిఫిట్ షోలు రద్దు చేశామని చెబుతూ ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడమేంటని ప్రశ్నించింది. తాజా పరిణామాల దృష్ట్యా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బెనిఫిట్, ప్రత్యేక షోలకు అనుమతించొద్దని సూచించింది. భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి వసూలు చేసుకోవడం సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించింది. తెల్లవారుజామున షోలకు అనుమతి ఇవ్వడంపై పునఃసమీక్షించాలని హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది.
కాగా ‘పుష్ప2’ మూవీ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో బెనిఫిట్ షోలకు అనుమతి లేదంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ‘గేమ్ ఛేంజర్’ మూవీకి మాత్రం తెల్లవారుజామున నాలుగు గంటల షోకు అనుమతి ఇవ్వడంతో పాటు టికెట్ రేట్లు పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనిపై ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి మాట మీద ఎందుకు నిలబడలేదని మండిపడుతున్నాయి.