ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై.. టీటీడీ ఛైర్మన్ క్షమాపణలు చెప్పాలన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కుమారపురంలో గోకులం షెడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో కేవలం 268 గోకులం షెడ్లను నిర్మిస్తే.. తాము మాత్రం ఆరు నెలల్లోనే 12,500 గోకులాలను నిర్మించామని తెలిపారు. వీటి ద్వారా చిన్న రైతులు, కౌలు రైతులు, పాడి పరిశ్రమతో జీవించే వర్గాలకు మేలు జరుగుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు.
గత ప్రభుత్వం పాడి పరిశ్రమను నిర్వీర్యం చేయడానికి అమూల్‌ను తీసుకొచ్చి.. ప్రభుత్వ డెయిరీలను నాశనం చేసిందని పవన్ కళ్యాణ్ అన్నారు. గుజరాత్‌లో గోకులాల ద్వారా రూ.60,000 కోట్ల ఆర్థిక వ్యాపారం జరుగుతోంది. ఇక్కడ కూడా పాడి పరిశ్రమను గుజరాత్ తరహాలో అభివృద్ధి చేయాలనుకుంటున్నామని పేర్కొన్నారు. గోవులు, గోకులాలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పవన్ అన్నారు.
భవిష్యత్తులో 20వేల గోకులాలను ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని పవన్ కళ్యాణ్ అన్నారు. తమ ప్రభుత్వం పల్లె పండుగల ద్వారా గ్రామీణాభివృద్ధికి పునాది వేసిందని.. సకాలంలో జీతాలు, ఫించన్లు పంపిణీ చేయడానికి ప్రణాళికలు రూపొందించామని పవన్ అన్నారు. ప్రజలు తమను నమ్మి అవకాశం ఇచ్చారని.. తప్పుడు జరిగినా స్పందించాలి అనేది తన నమ్మకమని తెలిపారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై బాధితుల్ని పరామర్శించానని.. క్షమాపనలు కూడా కోరానని పవన్ అన్నారు.
తిరుపతి ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్న పవన్ కళ్యాణ్.. ఈ ఘటన తనను వ్యక్తిగతంగా ఎంతో బాధించిందని అన్నారు. పిఠాపురంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించాలని అనుకున్నామని.. కానీ ఈ ఘటన దృష్ట్యా వేడుకలను తగ్గించాంమని పవన్ వెల్లడించారు. ఎక్కడైనా తప్పు జరిగితే అది తమ అందరి సమష్టి భాద్యతని, అందుకే తిరుపతి ఘటనపై క్షమాపణలు చెప్పానని పవన్ అన్నారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరి బోర్డు సభ్యులు కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సారీ చెప్పడానికి నామోషీ ఎందుకని ప్రశ్నించారు.
ఇక ప్రమాద సమయంలో కేరింతలు, అరుపులు అనవసరమని అన్నారు. పోలీసులకు సహకరించడం చాలా ముఖ్య మని అన్నారు. కొన్ని వ్యక్తుల తప్పిదాల వల్ల మొత్తం జిల్లా పోలీసు యంత్రాంగం బాధను అనుభవించిందని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి, అధికారి తమ బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించాలన్నారు. గత ప్రభుత్వంలో ఏర్పడిన అవకతవకలు ఇప్పటికీ కొన్ని సమస్యలుగా మిగిలాయని.. న్యాయం అందరికీ చేరాలంటే ప్రజా సేవలో బాధ్యతతో ముందుకు రావాలని పవన్ కళ్యాణ్ కోరారు.