తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం(Collectors Meeting) అయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం సచివాలయంలో కలెక్టర్లతో జరుగుతున్న ఈ భేటీలో సీఎం పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఈనెల 26 నుంచి రైతు భరోసా అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో దీనిపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు పలు కార్యక్రమాలు చేపట్టాలని నాయకులు, కార్యకర్తలు, అధికారులకు సూచించారు. ఈ క్రమంలో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే అంశాల మీద కలెక్టర్లతో చర్చించనున్నారు. ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లేలా పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించనున్నారు.