సంక్రాంతి సందర్భంగా కోడిపందేలు, పేకాట ఇతర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చట్ట పరిధిలో కఠిన చర్యలు తీసుకుంటామని అన్నమయ్య మరియు కడప జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సంక్రాంతి పండుగ రోజులలో సాంప్రదాయ క్రీడల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. కోడిపందేలు, పేకాట నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జూద క్రీడలు కాకుండా సాంప్రదాయ ఆటలు ఆడుకోవాలని సూచించారు.
కోడిపందేలు, పేకాట, గుండాట, చక్కా బొమ్మ.. ఇలా ఏ జూద వ్యసనమైనా ప్రజల జీవితాలను నాశనం చేస్తుందన్నారు. అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనే వారిని ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించబోమన్నారు. కోడి పందేల జూదరులు, కోడి కత్తుల తయారీదారులు మరియు పేకాట శిబిరాల నిర్వహకులపై ఇప్పటికే బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నామన్నారు.
వారిపై గట్టి నిఘా ఉంచామన్నారు. కోడి పందేలు, జూదాల వల్ల ప్రజలు సులభంగా డబ్బులు సంపాదించాలని ఆశ పడి పందేలు కాసి డబ్బును నష్టపోతున్నారన్నారు. దీనివల్ల పండుగ పూట వారి కుటుంబం ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎవరైనా జిల్లాలో కోడి పందేలు నిర్వహించినా… పందేలు నిర్వహణకు స్థలాలు, భూములు ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొందరు యువకులు జూదాలకు బానిసలై… కేసుల్లో ఇరుక్కుపోయి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. యువత ఇటువంటి కేసులలో ఉంటే వారి యొక్క భవిష్యత్తు అంధకారమవుతుందని… ఇతర దేశాలలో ఉద్యోగాల కొరకు వెళ్లే వారికి మరియు ప్రభుత్వ ఉద్యోగాలు పొందే సమయములో, పాస్ పోర్ట్ పొందే సమయాలలో ఈ కేసులు అడ్డంకిగా మారి యువత యొక్క జీవితాలు అధోగతి పాలవుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
ఎక్కడైనా కోడిపందేలు ఆడినా, జూదం ఆడినా మరియు ఇతర అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించిన సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి లేదా డయల్ 100/112 కు ఫోన్ చేసి సమాచారం తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, ఎస్పీ.విద్యాసాగర్ నాయుడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.