అవినీతి ఆరోపణల నేపథ్యంలో నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ(Nalgonda Intelligence SP) గంజి కవితపై వేటు పడింది. ఆమెను డీజీపీ ఆఫీసుకి ఎటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సొంత సిబ్బందితో అధిక వడ్డీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సైతం చేయించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. దాదాపు 9 పేజీల లేఖతో ఇంటిలిజెన్స్ సిబ్బంది ఆమె ఆగడాలపై ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా.. దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
కాగా నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీగా కవిత ఏడేళ్ల పాటు విధులు నిర్వర్తించారు. ఈ ఏడేళ్లలో ఆమె రేషన్, గుట్కా మాఫియాల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. అలాగే ఓ ఎస్ఐతో పాటు నలుగురు కానిస్టేబుళ్లతో కవిత ఈ దందా కొనసాగించినట్లు తేలింది. దీంతో వీరిపైనా దర్యాప్తు కొనసాగుతోంది. సమగ్ర విచారణ తర్వాత ఆమెను సస్పెండ్ చేసే అవకాశం ఉంది.