హీరో అల్లు అర్జున్(Allu Arjun)కు ఊరట లభించింది. విదేశాలకు వెళ్లేందుకు నాంపల్లి కోర్టు(Nampally Court) అనుమతి ఇచ్చింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలన్న నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. కాగా ఇటీవల రెగ్యులర్ బెయిల్ మంజూరు సమయంలో ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరుకావాలని కోర్టు షరతులు విధించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో భద్రతా కారణాల దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని బన్నీ న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు. దీంతో కోర్టు ఆయనకు మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు షరతులతో కూడిన బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. రూ.50వేలు చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే సాక్షులను ప్రభావితం చేయకుండా కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేసింది. ఇక రెండు నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని షరతు విధించిన విధితమే. ఈ నేపథ్యంలో గత ఆదివారం పోలీస్ స్టేషన్‌కు హాజరై సంతకం పెట్టి వచ్చారు.